- వినతి పత్రం ఇచ్చిన ఏఈవోల సంఘం
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జానయ్యను తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇన్-సర్వీస్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల బీఎస్సీ (అగ్రికల్చర్) ప్రవేశాల నిబంధనల సవరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఇటీవల ఎప్‌సెట్ లేదా సీయూఈటీ (యూజీ) అర్హతను తప్పనిసరి చేయడంతో ఇన్-సర్వీస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంఘం ప్రతినిధులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యపై వీసీ సానుకూలంగా స్పందించినట్టు నాయకులు తెలిపారు.
2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇన్-సర్వీస్ ఏఈవోల కోసం ప్రత్యేకంగా అగ్రీసెట్ నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి సర్వీస్ సీనియారిటీ ఆధారంగా బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని వీసీ పేర్కొన్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గౌడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె. ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె. సురేష్ రెడ్డి, కోశాధికారి జె. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
