బంగారు తెలంగాణ కాదు కంగారు తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు కంగారు తెలంగాణ

రాష్ట్ర ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ కంగారు తెలంగాణగా మారిందని జైళ్లశాఖ మాజీ డీజీ వీకే సింగ్‌ అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం కుటుంబపాలనలో మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌‌ను నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. సోమవారం ఆయన సోమాజిగూడ  ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చర్యలతో అవినీతి, అప్పుల ఊబిలో రాష్ట్రం మునిగిపోయిందన్నారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్‌‌పై త్వరలోనే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పారు. ఫైనాన్స్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టులే ఆ విషయం స్పష్టం చేస్తున్నాయని వివరించారు. అవినీతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా‘‘మహా పరివర్తన్‌ ఆందోళన్‌ తెలంగాణ”పేరుతో నాన్‌ పొలిటికల్‌ ఆర్గనైజేషన్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్షన్‌ సభలు, ర్యాలీలకు రూ.100 కోట్లు ఖర్చు‌

ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని వీకే సింగ్‌ విమర్శించారు. ఎలక్షన్ మీటింగ్స్, ర్యాలీల కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి మర్చిపోయారన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే కేసీఆర్ దళితబంధు లాంటి స్కీమ్స్‌ ప్రకటిస్తున్నాడని ఆరోపించారు. ఈక్రమంలోనే  ఆదివాసీ బంధు, ముస్లిం బంధులు ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ‘‘ఎలక్షన్ల బంధు’’గా పేరు తెచ్చుకుంటాడని జోష్యం చెప్పాడు. ప్రజల భయంతో ప్రగతిభవన్‌ను కేసీఆర్‌‌ గడి కోటగా మార్చుకున్నారని ఆరోపించారు. ఎలక్షన్స్‌ సమయంలోనే  ఆయన కోటలో నుంచి బయటకు వస్తాడని ఎద్దేవా చేశారు.
అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు
టీచర్స్‌ లేకపోవడంతో నాలుగు వేల స్కూళ్లు మూతపడ్డాయని వీకే సింగ్ అన్నారు. అవినీతిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాజకీయ పార్టీల అవినీతికి వ్యతిరేకంగా ‘‘మహా పరివర్తన్‌ ఆందోళన్‌ తెలంగాణ” యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పాలన, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల కోసం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆఫీసులో ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటామన్నారు.