మీకు స్థలముంటే డబ్బులిస్తాం.. లేకపోతె మేమే ఇల్లు కట్టిస్తాం

V6 Velugu Posted on Sep 11, 2021

  • హుజూరాబాద్ లో మంత్రి హరీష్ రావు
     

కరీంనగర్: మీకు స్థలముంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులిస్తాం.. లేకపోతే మేమే ఇల్లు కట్టించి ఇస్తామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హుజురాబాదులో ఆటోనగర్ భూమి పూజలో సహచర మంత్రి గంగుల కమలాకర్ తో కలసి ఆర్ధిక మంత్రి  హరీష్ రావు  పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెకానిక్ ల కోసం ఏ సహాయమైనా చేస్తామన్నారు. 347 కుటుంబాలకు ఈ ఆటోనగర్ లో ప్లాట్లు కేటాయించి వారికి శాశ్వత ప్రాతిపదికన షెడ్లు కట్టిస్తున్నామని, మీరు అద్దెలు చెల్లించనవసరం లేకుండా ఇది మీకు శాశ్వత ఆస్తిగా ఉంటుందన్నారు. టీఎస్ఐఐసీ ద్వారా ఆటోనగర్ కోసం 3 కోట్లు మంజూరు చేశామని, ఇక్కడ రోడ్లు, మంచినీరు, మరుగుదొడ్ల వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హుజురాబాద్ లోని మెకానిక్కులందరూ ఇక్కడే ఉండేలా చూసుకుంటే.. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 
మేము ఆటోనగర్ కోసం హామీ ఇచ్చినప్పుడు మీకు అనుమానం ఉండేది. ఇంత వేగంగా అవుతుందా అనే అనుమానం మీకుండేది, మీకు సొంత స్థలాలు ఉంటే... ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తాం,  స్థలం లేని వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో సంక్షేమ యుగం నడుస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గతంలో ఆడపిల్లల పిల్లల పెళ్లికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని,  ఆడ పిల్లలకు సాయం అందిస్తోన్న దేశంలోని మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు, రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవన్నారు. గెల్లు శ్రీనివాస్ కు ఎన్నికల డిపాజిట్ కూడా మేమే కడుతామని మోటార్ వర్కర్స్ నేతలు చెప్పడం సంతోషం కలిగించిందననారు. మీ అందరు కలిసి నామినేషన్ డబ్బులు కడుతామంటే మాకూ సంతోషమే, ఇక్కడ లబ్ధి పొందిన  347 మంది కలిసి తలో 20 ఓట్లు వేయిస్తారని ఆశిస్తున్నామన్నారు. 
పువ్వు గుర్తుకు ఓటేస్తే సిలిండర్ ధర రూ.1500 అవుతుంది
బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి, గ్యాస్ సబ్సిడీ తగ్గించారు, అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర 1500 అవుతుందన్నారు. బొట్టుబిల్లలు, గోడగడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీ ఎప్పటిలాగే ఇస్తామని చెప్పండి అని ఆయన సవాల్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి, కుదవపెట్టి.. ఉద్యోగాలన్నీ ఊడగొడతారట, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ సంస్థల చేతిలోకి పోతే రిజర్వేషన్లు పోయి.. పిల్లలకు ఉద్యోగాలు ఊడుతాయి అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ అనుబంధ కార్మికసంఘమైన బీఎంఎస్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చా కూడా.. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తోందని, ఆ పార్టీని సొంత మనుషులే తప్పు పడుతుంటే.. మనం ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాలి ? అని ప్రశ్నించారు. మీకు ఆటోనగర్ అనే అడ్డానిచ్చి... మీ ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వం మాది అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 
ఆటో నగర్ కార్మికులకు పండుగ రోజు
ఆటో నగర్ కార్మికులకు ఈ రోజు పండుగ రోజులాంటిదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆటో నగర్ కార్మికులు 20 ఏళ్లుగా స్థలం కోసం ఎంతో మంది నాయకుల చుట్టు తిరిగారు, కానీ నేడు సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావు చొరవ మేరకు 10 ఎకరాల స్థలంలో సుమారు 355 మందికి పైగా నిరుపేద కార్మికులకు స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. రెండు మూడు నెలల్లో షెడ్లు, ఇండ్లు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు.
 

Tagged Karimnagar District, Minister Gangula Kamalakar, Huzurabad, , huzurabad updates, minister hareesh rao, ministers tour, autonagar huzurabad, huzurabad autonagar

Latest Videos

Subscribe Now

More News