ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కొన్ని సర్ప్రైజ్ రిజల్ట్స్ తప్పలేదు. ముఖ్యంగా తమిళనాట సీనీ హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే అనూహ్య విజయాలు సాధించడం పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కు సర్పైజ్ కలిగించాయని చెప్పాలి. అలాగే, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు చెప్పినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం టఫ్ ఫైట్ ఉండనుందని విశ్వసించారు. కానీ ఫలితాలు చూస్తే, అక్కడ మెజారిటీ, మైనారిటీ పోలరైజేషన్ కొంత ఊహించని విధంగా జరిగిందని ఫలితాలే చెపుతున్నాయి. ఇకపోతే, అస్సాంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలనే నిజం చేస్తూ బీజేపీ గెలుపు సాధించింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇక పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్డీఏనే తిరిగి మెజారిటీ సాధిస్తుందని రాజకీయ పండితుల్లో మొదటి నుంచీ ఉన్న అభిప్రాయమే నిజమైంది.
తమిళనాట మొదటి నుంచి సీనీ రంగమే అక్కడి రాజకీయాలను శాసిస్తూవస్తున్న విషయం తెలిసిందే. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సీనీ రంగం నుంచి వచ్చిన వారే. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన సీనీ ప్రముఖులు చాలా మందే ఉన్నారు. కానీ ఎవరూ గెలవలేకపోయారు. శివాజీ గణేశన్, కే, భాగ్యరాజ్, టీ. రాజేందర్ లాంటి వారు పార్టీలు స్థాపించి ఘోర పరాజయాలు మూటకట్టుకున్నారు. విజయకాంత్ పార్టీ పెట్టి కొంత విజయం సాధించినా, కొనసాగలేకపోయారు.
స్టాలిన్ మాస్ కాలేకపోయాడు!
1967 నుంచి ద్రవిడ రాజకీయాలకు తమిళనాడు పుట్టినిల్లు. ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత హయాంలు ముగిసాక.. 2021లో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నిజానికి మాస్ లీడర్ కాకపోయినా, ద్రవిడ రాజకీయ పంథాను మాత్రం నడిపే ప్రయత్నం నిరంతరం చేస్తూవచ్చాడు. కానీ అది పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించలేదు. హిందీ వ్యతిరేకత, ఉత్తారాది వ్యతిరేకత, దక్షిణాదికి అన్యాయం అంటూ ఆయన గత ఐదేళ్లుగా వార్తల్లో కనిపిస్తూ వస్తున్నారు కూడా. కానీ ద్రవిడ వాదాన్ని బలంగా వినిపించినా.. పరిపాలనలో అంతే పాపులర్ కాలేకపోయాడని ఫలితాలు చెపుతున్నాయి. మొదటి నుంచీ డీఎంకే కుటుంబ పార్టీగా పేరుపడి ఉంది. అవినీతి ఆరోపణలు కూడా బలంగానే వినిపించాయి. ప్రత్యామ్నాయంగా అన్నా డీఎంకే ఉన్నా, ఎందుకో గానీ పళనిస్వామి నేతృత్వంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయంగా ప్రజలను ఆకర్షించలేకపోయిందని గత లోక్‌సభ ఎన్నికలతో పాటు, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే విషయాన్ని చెపుతున్నాయి.
పొలిటికల్ స్పేస్‌ను అందిపుచ్చుకున్న విజయ్
తమిళనాట డీఎంకేకు ప్రత్యామ్నాయంగా జయలలిత తర్వాత ఏఐడీఎంకే బలహీనపడింది. దాన్ని గమనించే విజయ్ టీవీకే పార్టీని ఫిబ్రవరి 2, 2024న స్థాపించాడని చెప్పొచ్చు. రాజకీయ రంగంలో పార్టీ స్థాపించి మొదటిసారే అధికారంలో వచ్చిన వారు ఎమ్జీఆర్, ఆ తర్వాత ఎన్టీఆర్, ఇపుడు విజయ్. అలా అని పార్టీలు పెట్టిన సీనీ హీరోలందరూ సక్సెస్ కాలేదు. అందుకు సమయం, సందర్భం, రాజకీయాల్లో స్పేస్ ఉన్నపుడు స్థాపించి, ప్రజల్ని ఆకర్షిస్తే తప్ప ఏ పార్టీ సక్సెస్ సాధించలేదు. సరిగ్గా విజయ్ సమయం, సందర్భం, రాజకీయ శూన్యత ఉన్న పరిస్థితుల్లోనే పార్టీ స్థాపించి సక్సెస్ సాధించాడని చెప్పాలి. సీనీ హీరోగా విజయ్ బాగా పాపులర్. అందునా యువకుడు. ఆయన పార్టీని స్థాపించడం తమిళనాట యువతలో ఒక ఉత్సాహాన్ని తెచ్చింది.
తమిళనాట అర్బన్ ప్రాంతాల్లో టీవీకే క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి. అర్బన్ ప్రాంతాలలో లాగా గ్రామీణ ప్రాంతాల్లో టీవీకే ప్రభావం చూపలేకపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా డీఎంకే, అన్నాడీఎంకేనే పోటీపడ్డాయి. ఆ విషయం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగానే విజయ్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లోనూ బాగా ప్రభావం చూపి ఉంటే, టీవీకే పార్టీ 107 స్థానాల వద్దనే ఆగిపోయేది కాదు, సుమారు 150 స్థానాల వరకు గెలుచుకునేది అని చెప్పొచ్చు. ఏదేమైనా, తమిళనాట, మరొక ద్రవిడ పార్టీ ఉదయించింది. టీవీకే మెజారిటీకి 8 స్థానాల దూరంలో ఉన్నా.. కాబోయే సీఎం మాత్రం విజయ్ యే అని రూఢీ అయింది. ఇక తెలియాల్సింది జాతీయ రాజకీయాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది? ఎన్డీఏ, ఇండియా కూటములలో ఏ కూటమిలోనైనా చేరుతారా? లేదా రెండు కూటములకు సమదూరం పాటిస్తారా? అనేదే ప్రస్తుతానికి అసక్తిగా ఎదురు చూడాల్సిన విషయం!
ఎస్ఐఆర్ రాజకీయం
తమిళ నాడు సర్పైజ్ ఫలితాలు ఒకవైపు, మరోవైపు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ- బీజేపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందని భావించిన రాజకీయ పండితుల అభిప్రాయానికి భిన్నంగా, బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. గత 3 నెలలుగా బెంగాల్ రాజకీయాలు చాలా హాట్‌గా సాగుతూ వచ్చాయి. మమతా బెనర్జీ రాజకీయం ఎన్నికల కమిషన్ చుట్టే తిరిగింది. రాజకీయంగా బీజేపీతో కాకుండా ఈసీతో చేసిన పోరాటం ఆమెకు లాభం చేసిందనే కన్నా, కొంత నష్టమే చేసిందని ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. ఫలితంగా మెజారిటీ, మైనారిటీ పోలరైజేన్ జరిగింది. అది మమతకు ఏమేరకు లాభం చేసింది కొంతే, బీజేపీకే జరిగిన లాభం ఎక్కువ. ఇకపోతే, బెంగాల్ ప్రజలు చొరబాటు దారులకు ఎస్ఐఆర్ ఎంతో కొంత చెక్ పెడుతుందనే భావించారు. అయితే, దీదీ మాత్రం ఎన్నికల కాలమంతా ఎస్ఐఆర్పై నే నిరంతరం పోరాటం చేస్తూ ఉండిపోయింది. అది ఆమెకు మైనారీటీ పోలరైజేషన్ ను మరింత పెంచింది ఎంత నిజమో, కొంతమేర మెజార్టీలను ఆమెకు దూరం చేసిందనేది కూడా అంతే నిజం. అది పరోక్షంగా బీజేపీకి మెజార్టీ పోలరైజేషన్ జరగడానికి అవకాశమిచ్చిందని ఫలితాల తర్వాత రాజకీయ పండితులు చెపుతున్నారు.
హింస ప్రభావం
దీదీ ఓటమికి గల కారణాలలో శాంతి భద్రతల సమస్య కూడా పనిచేసింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన, సందేశ్ ఖాళీ వంటి ఉదంతాలు దీదీ కి ఇబ్బందిగా మారాయి. ఎన్నికల్లో రెండు లక్షల సాయుధ బలగాలను దించారని దీదీ ఈసీ ని తప్పుపట్టింది. నిజానికి బెంగాల్లో ఏ ఎన్నికలు కూడా ఇప్పటి వరకు శాంతి యుతంగా జరిగిన దాఖలా లేదు. ఇప్పటి వరకు హింసా సంఘటనలు, హత్యలు జరగని ఎన్నికలు లేవు. కేంద్ర బలగాలను దించడం వల్లనే ప్రజలు భయం లేకుండా ఓటేశారని, హింసలేకుండా మొదటిసారి పోలింగ్ కూడా 92 శాతం జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
వలసల ప్రభావం
సంక్షేమ పథకాలే రాజకీయాలను శాశ్వతంగా నడపలేవని బెంగాల్ ఫలితాలు చెపుతున్న సారాంశం. మహిళలకు లక్కీ బండార్ లాంటి రూ.1500 నగదు పథకాలతో దీదీ గెలుస్తాననుకున్నది. కానీ అవి ఓట్లకు మాత్రమే పరిమితమై, ఉపాధి మార్గాలు చూపకపోతేనే సమస్య. బెంగాల్‌కు పెట్టుబడులు రాకపోవడం, ఇండస్ట్రియలైజేషన్ ఆగిపోవడం, ఫలితంగా బెంగాల్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళుతున్న వలసలకు ఆమె ప్రభుత్వం పరిష్కారం చూపలేకపోయింది. లక్షలాది బెంగాలీలు దేశ వ్యాప్తంగా వలసజీవులుగా మారారు.. నందిగ్రామ్, సింగూర్ నుంచి టాటా కంపెనీలను స్వయాన దీదీ యే తరిమేసింది. అవి గుజరాత్‌కు వెళ్లిపోయాయి. బెంగాల్ ప్రజలు ఇపుడు గుజరాత్ కు వెళ్లి అవే కంపెనీల్లో పనిచేయడం గమనార్హం. మూడు దఫాలుగా గెలిపించినా, బెంగాల్లో ఉపాధి మార్గాలు చూపకపోవడం దీదీ ఓటమి కారణాల్లో ఒకటని చెప్పాలి.
మోనోపలి రాజకీయం మారేనా?
దీదీ బలమైన నాయకత్వం బెంగాల్ రాజకీయాలను రెండుగా దశాబ్దాలుగా శాసించింది. నిజానికి ఆమె ఈ ఓటమితో కుంగిపోయేది కూడా ఏమీ లేదు. బెంగాల్‌ను మొదట్లో 25 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు 34 ఏండ్లు పాలించారు. ఇపుడు దీదీ 15 ఏండ్లు పాలించింది. పార్టీల మోనోపలి రాజకీయాలకు అలవాటు పడిన బెంగాల్ ను, ఇపుడు గెలిచిన బీజేపీ కూడా మోనోపలి రాజకీయలను పక్కన పెట్టి, బెంగాల్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తుందా లేదా అనేదే ఇకపై చూడాల్సిన విషయం.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ : openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
