హైదరాబాద్ సిటీలో లక్ష కేజీల కల్తీ సరుకు పట్టివేత : అల్లం వెల్లుల్లి కల్తీ టాప్.. ఆ తర్వాత పండ్లు..!

హైదరాబాద్ సిటీలో లక్ష కేజీల కల్తీ సరుకు పట్టివేత : అల్లం వెల్లుల్లి కల్తీ టాప్.. ఆ తర్వాత పండ్లు..!

హైదరాబాద్‌లో కల్తీ మాఫియా ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన ‘హెచ్ -ఫాస్ట్’ విభాగానికి సంబంధించిన   ప్రత్యేక ఫోర్స్ జరిపిన మెరుపు దాడుల్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 173 కేసులు నమోదయ్యాయి. జోన్లవారీగా చూస్తే అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 51 కేసులు, గోల్కొండ జోన్‌లో 42, సికింద్రాబాద్ జోన్‌లో 33 కేసులు నమోదు కాగా, చార్మినార్‌లో 19, జూబ్లీహిల్స్, శంషాబాద్ జోన్లలో చెరో 12 చొప్పున, ఖైరతాబాద్ జోన్‌లో 4  కేసులు నమోదయ్యాయి. 

ఈ దాడులలో అధికారులు సుమారు 94,850.2 కేజీల భారీ మొత్తంలో కల్తీ సరుకును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, తదుపరి చట్టపరమైన నిబంధనల నిమిత్తం ఇందులో 36 కేసులను జీహెచ్‌ఎంసీకి చెందిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు బదిలీ చేశారు.  ఈ దాడుల్లో నిత్యం ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులే టార్గెట్‌గా కల్తీ జరుగుతున్నట్టు తేలింది.

 ఇందులో అత్యధికంగా 26 అల్లం వెల్లుల్లి పేస్ట్ కేసుల్లో ఏకంగా 26,608.2 కేజీల కల్తీ సరుకు దొరకగా, కృత్రిమంగా పండించే 16 పండ్ల కేసుల్లో 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. వీటితోపాటు దాదాపు 15 టన్నుల కల్తీ చికెన్, మాంసం, 8,960 కేజీల ఊరగాయలు, 4,030 కేజీల కోవా, 3,897 కేజీల టీ పౌడర్, 2,500 కేజీల పెరుగు, 1,514 కేజీల పనీర్‌ను హెచ్- ఫాస్ట్ అధికారులు పట్టుకున్నారు. వీటితో పాటు ఐస్‌క్రీమ్స్ (15 కేసులు), ఆర్‌ఓ ప్లాంట్ నీళ్లు (11 కేసులు), బిస్కెట్లు, నెయ్యి, నూడుల్స్, స్వీట్లు, వివిధ రకాల మసాలాల తయారీ కేంద్రాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అయితే వీరికి హోటల్స్​ సీజ్​ చేయడం,   భారీగా పెనాల్టీలు వేయడం, నాన్​ బెయిలెబుల్​ కేసులతో జైలు శిక్షలాంటి అధికారాలు లేవు.