ఫేక్​ ఇన్సూరెన్స్​ దందా.. సభ్యులంతా ఆర్టీఏ, ఇన్సూరెన్స్​ ఏజెంట్లు 

ఫేక్​ ఇన్సూరెన్స్​ దందా.. సభ్యులంతా ఆర్టీఏ, ఇన్సూరెన్స్​ ఏజెంట్లు 

వరంగల్‍, వెలుగు: వరంగల్​ కేంద్రంగా జరుగుతున్న ఫేక్​ ఇన్సూరెన్స్​ బాండ్ల బాగోతం బయటపడింది. వెహికల్స్​కు ఇన్సూరెన్స్ ​కంపల్సరీ కావడంతో 10 మంది ఏజెంట్లు రెండు ముఠాలుగా దందా మొదలుపెట్టారు. వెహికల్‍ రిజిస్ట్రేషన్‍, డ్రైవింగ్‍ లైసెన్స్​ల కోసమొచ్చే వారిని టార్గెట్‍ చేశారు. వేలల్లో  డబ్బులు తీసుకుని ప్రముఖ ఇన్సూరెన్స్ ​కంపెనీల పేర ఫేక్‍ బాండ్లు తయారు చేసి ఇచ్చేవారు. రెండు ముఠాలు దాదాపు 10 వేల మందిని ఫేక్‍ బాండ్లతో  మోసం చేసినట్లు పోలీసులు  చెబుతున్నారు. ఫేక్​ బాండ్లను సృష్టించిన 8మందితో పాటు ఇద్దరు ఆర్టీఏ సిబ్బందిని  అరెస్ట్​ చేశారు. ఈ వివరాలను వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ డాక్టర్‍ తరుణ్‍జోషి మంగళవారం వెల్లడించారు.

సపరేట్‍ యాప్స్​, క్యూఆర్‍ కోడ్స్​

వరంగల్​లో  ఆర్టీఏ  ఏజెంట్లుగా పని చేస్తున్న వీరంతా జీతం సరిపోక  ఫేక్‍ ఇన్సూరెన్స్​ డాక్యుమెంట్ల మోసాలకు తెర తీశారు. క్యూఆర్‍ కోడ్‍ మేకర్‍, బార్‍ కోడ్‍ జనరేషన్‍, బైక్స్​ స్కౌట్స్​, నైట్రొ పీడీఎఫ్‍ వంటి యాప్‍లు డౌన్‍లోడ్‍ చేశారు. ఈ యాప్​ల సాయంతో ఎవరో ఒకరి ఇన్యూరెన్స్​బాండ్‍ ఓపెన్‍ చేసి.. అందులోని అసలు పేరు, వెహికల్‍ డీటెయిల్స్​,  ఇతర ఇన్ఫర్మేషన్‍ డిలీట్‍ చేసి డబ్బులు వసూలు చేసిన వారి వివరాలు ఎంటర్‍ చేసేవారు.  ప్రముఖ ఇన్సూరెన్స్​ కంపనీల పేర ఫేక్‍ బాండ్‍ ఇచ్చేవారు. ఆర్టీఏ ఆఫీస్​ స్టాంపులను కూడా  తయారు చేసి  ఇన్సూరెన్స్​ రెన్యూవల్‍ చేయడం మొదలుపెట్టారు. ఒక్కో వెహికల్​కు  రూ.2 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేశారు.

క్లెయిమ్‍ కోసమెళ్తే.. ఫేక్‍ అని తెలిసింది

ఈ ముఠా  నుంచి ఇన్సూరెన్స్​ బాండ్​ తీసుకున్న ఒకరి వాహనానికి ఈ మధ్యనే యాక్సిడెంట్‍ కాగా..  క్లెయిమ్‍ కోసమని ఇన్సూరెన్స్​ఆఫీస్‍ వెళ్లాడు. బాండ్​ను పరిశీలిస్తే అది ఫేక్‍ అని తేలడంతో వరంగల్‍ ఇంతేజార్‍గంజ్‍ పోలీసుస్టేషన్​లో కంప్లైంట్​ చేశారు. టాస్క్​ఫోర్స్​ అడిషనల్‍ డీసీపీ వైభవ్‍ గైక్వాడ్‍, సీఐ సంతోష్‍ ఆధ్వర్యంలో ఇంతేజార్‍గంజ్‍, మిల్స్​కాలనీ పోలీసులు దాడులు చేసి ముఠాసభ్యులను పట్టుకున్నారు.  వాహనదారులకు ఆర్టీఏ ఆఫీస్‍ నుంచి పోస్ట్​లో  రావాల్సిన ఒరిజినల్‍ డ్రైవింగ్‍ లైసెన్స్​లు, ఆర్‍సీ లు కూడా వీరి దగ్గర దొరికాయి.

ప్రీమియం రేట్‍ తక్కువనగానే.. ఎగవడ్డరు 

దాదాపు పదివేల మంది ఫేక్‍  బాండ్ల తీసుకుని మోసపోయారని సీపీ తరుణ్‍జోషి తెలిపారు. ఈ దందావల్ల  రూ.90 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందన్నారు. తక్కువ ప్రీమియం అనడంతో చాలామంది అమాయకులు వీరి దగ్గర ఇన్సూరెన్స్​ బాండ్లు తీసుకున్నట్టు చెప్పారు. లారీకి బీమా చేయించాలంటే మామూలుగా కంపెనీలు రూ. .50 నుంచి 60 వేలు ప్రీమియం కలెక్ట్​ చేస్తాయి. కేవలం రూ. 10 వేలకే బీమా చేయిస్తామనడంతో వీరిని ఆశ్రయించారు. ముఠా సభ్యుల నుంచి రూ.4 లక్షల 46 వేల నగదు, 3 ల్యాప్‍టాప్​లు, 2 కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, 5 బైకులు, 10 సెల్‍ఫోన్లు, 433 ఒరిజినల్ రిజిస్ట్రేషన్‍, లైసెన్స్​ కార్డులతో పాటు ఫేక్‍ బాండ్లు, రబ్బర్‍ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సైలు లవణ్‍కుమార్‍, ప్రియదర్శిని, స్వామి, కుమారస్వామితీ సీపీ అభినందించారు.

ముఠా సభ్యులు వీరే.. 
 ఎండీ షఫీ (కొండపర్తి),  సయ్యద్‍ జహంగీర్‍ (కాశిబుగ్గ), పెన్నల రాజేశ్‍ (పుప్పాలగుట్ట) వాంకిడి నిఖిల్‍(లెనిన్‍నగర్),  మామిడి రాజు
( శివనగర్‍), నాగమల్లి శివకుమార్‍
(  కాశిబుగ్గ), అల్లాడి రాజ్‍కుమార్‍
(  హంటర్‍రోడ్‍),  గుండబోయిన శ్రీకాంత్‍ 
( వంగపహాడ్‍),  కేశోజు రాజ్‍కుమార్‍ (గుడిబండల్‍),  బల్లాని సుమన్‍ (నర్సంపేట)