హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కలకలం రేపాయి. ఒకవైపు భారీగా డ్రగ్స్ పట్టుబడగా.. మరోవైపు నకిలీ వీసాతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన కేటుగాడు కస్టమ్స్ అధికారులకు చిక్కాడు.
ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా గాంజా పట్టుబడింది. బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు.. అతడి లగేజీని క్షుణ్ణంగా స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల్లో లగేజీ బ్యాగ్ కింది భాగంలో అత్యంత చాకచక్యంగా ప్యాకెట్లలో దాచి ఉంచిన హైడ్రోపోనిక్ 10 కేజీల గాంజాను అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ ఈ గాంజా విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.
నకిలీ వీసాతో
ఇదిలా ఉంటే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మరో నిందితుడు పట్టుబడ్డాడు. నకిలీ వీసాతో రసూల్ ఖైమా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక ప్రయాణికుడిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అతడి పాస్‌పోర్ట్, వీసాలను నిశితంగా పరిశీలించగా.. అది నకిలీ వీసాగా తేలింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఇమ్మిగ్రేషన్ సిబ్బంది.. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ నకిలీ వీసాను ఎక్కడ తయారు చేయించాడు? దీని వెనుక ఉన్న ఏజెంట్లు ఎవరు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
