హైదరాబాద్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేయకుండా అప్రూవ్ చేసిన 10 మంది హౌసింగ్ ఏఈలపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఒక్కో ఏఈ ఒకటి లేదా రెండు మండలాల్లో 500 ఇండ్లను పరిశీలించి రూల్స్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేస్తున్నారా ? లేదా ? అనేది పరిశీలించి అప్రూవ్ చేయాలి. వీరు అప్రూవ్ చేసిన తర్వాతే ప్రభుత్వం ఇచ్చే సాయం లబ్ధిదారుడి అకౌంట్‌లో జమ అవుతుంది.
అయితే జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు ఏఈలు గ్రామాలకు వెళ్లకుండా, తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను విలేజ్ సెక్రటరీలకు ఇచ్చినట్లు విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీల్లో వెల్లడైంది. కొన్ని సార్లు ఒకే సమయంలో, మరికొన్ని సార్లు నిమిషాల వ్యవధిలోనే రెండు, మూడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను అప్రూవ్ చేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో ఆయా ఏఈలను వివరణ కోరగా.. తాము రూల్స్ ప్రకారమే చేశామని చెప్పారు.
కానీ ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్‌కు పిలిచి విచారించగా 10 మంది ఏఈలు తప్పును ఒప్పుకున్నారు. దీంతో జనగాం, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో పనిచేస్తున్న ఏఈలను సస్పెండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

