జీపీఎస్సాయంతో వెహికల్ తో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎల్బీ నగర్, వెలుగు: చోరీకి గురైన 108 అంబులెన్స్ ను జీపీఎస్ సాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న అంబులెన్స్ ను మంగళవారం అర్ధరాత్రి 2.15 గంటలకు ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. కీ లేకపోయినా వెహికల్ స్టార్ట్ చేసి పరారయ్యాడు. వెహికల్ చోరీ జరిగిన కొద్ది క్షణాల్లోనే గమనించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఆ వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో అంబులెన్స్ ను పోలీసులు గుర్తించారు.
వెహికల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. దీంతో సమీపంలో ఉన్న టోల్ గేట్ సిబ్బందిని పోలీసులు అలర్ట్ చేశారు. టోల్గేట్వద్ద పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు అంబులెన్స్ ను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. కాగా అంబులెన్స్ డ్రైవర్, పైలట్ విధి నిర్వహణలో ఉండకుండా ఆరోజు రాత్రి వెహికల్ ను వదిలి సమీపంలో నిద్రపోయారు.
