- వారం తర్వాత రుతుపవనాల కదలికల్లో వేగం
- ఐఎండీ తాజా అంచనాల్లో వెల్లడి
- నాలుగు రోజులుగా మండిన ఎండలు
- 150కిపైగా మండలాల్లో వడగాడ్పులు..
- సాయంత్రం కాగానే కొన్ని జిల్లాల్లో వానలు
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు బలపడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ వారం దాటితే మాన్సూన్ మరింతగా విస్తరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఐఎండీ చెబుతున్నది. ప్రస్తుతానికి రుతుపవనాలు బలహీనంగానే ఉన్నా.. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలుంటాయని పేర్కొంది. జులై 1 వరకు రాష్ట్రంలో ఉండే వాతావరణ పరిస్థితులపై ఐఎండీ తాజా అంచనాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా వేడిగాలుల ప్రభావం, పశ్చిమ, తూర్పుగాలుల మధ్య హోరాహోరీ ఎఫెక్ట్‌తో రుతుపవనాలు స్తంభించిపోయాయి.
అయితే, తాజాగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ పేర్కొంది. తక్కువ ఎత్తులో ఉండి తేమను తీసుకొచ్చే సోమాలి జెట్ (హిందూమహాసముద్రం నుంచి అరేబియా సముద్రంవైపు వీచే గాలులు) వచ్చేవారం బలపడతాయని తెలిపింది. ఇటు తేమను కలిగి ఉండే క్రాస్ ఈక్వెటోరియల్ ఫ్లో (భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లి మళ్లీ తిరిగొచ్చే పవనాలు) కూడా 24వ తేదీ నాటికి బలం పుంజుకునే అవకాశాలున్నాయని వెల్లడించింది.
అలాగే, తెలంగాణతో పాటు కోర్ మాన్సూన్ జోన్‌లోని రాష్ట్రాలపై వెస్టర్లీస్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఈ నెల చివరి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తూర్పు గాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఫలితంగా వచ్చే వారం చివరి నాటికి రుతుపవనాలు బలపడి.. మరింత ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే, మాన్సూన్ బలపడినా.. జులై చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఎల్‌నినో మరింత బలపడుతుందని, ఇప్పటికే పసిఫిక్‌లో దాని తీవ్రత ఎక్కువైందని
ఐఎండీ హెచ్చరించింది.
నాలుగు రోజులుగా హీట్ వేవ్స్
జూన్ తొలివారం నుంచే ఎండల నుంచి సాధారణంగా ఉపశమనం లభిస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం మూడో వారంలోకి ఎంటరైనా ఎండలు మాత్రం తగ్గడం లేదు. రెండో వారంలో కొంత బ్రేక్ ఇచ్చినట్టే కనిపించినా.. మళ్లీ నాలుగు రోజులుగా టెంపరేచర్లు పెరుగుతూ వస్తున్నాయి. హీట్‌వేవ్స్ పరిస్థితులూ ఉంటున్నాయి. పలు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులుగా 150కిపైగా మండలాల్లో వడగాడ్పులు రికార్డవుతున్నాయి. గురువారం 146 మండలాల్లో హీట్‌వేవ్స్, మరో 29 మండలాల్లో తీవ్రమైన హీట్‌వేవ్స్ నమోదయ్యాయి. 23 జిల్లాల్లో వడగాడ్పుల పరిస్థితి ఉందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో హీట్‌వేవ్స్ తీవ్రంగా ఉన్నట్టు డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డేటా స్పష్టం చేసింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్‌వేవ్స్ ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దాంతో పాటు సాయంత్రం సమయంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
పొద్దున ఎండలు.. సాయంత్రం వర్షాలు..
గురువారం పొద్దంతా ఎండలు దంచికొట్టినా.. సాయంత్రంకాగానే హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. సిటీలో వర్షం పడింది కాసేపే అయినా.. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల జిల్లా పూడూరులో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరులో 43 డిగ్రీలు రికార్డ్ అయింది. నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో 42.8 డిగ్రీలు, నిజామాబాద్ 42.7, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్‌లో 42.6, జయశంకర్ భూపాలపల్లిలో 42.2, ఆదిలాబాద్ 42.1, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ సిటీలోనూ 40 డిగ్రీల మేర టెంపరేచర్ రికార్డయింది. చార్మినార్, నాగోల్, గోషామహల్, సరూర్‌నగర్ సర్కిళ్లలో 40 డిగ్రీల రేంజ్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో మాటూరులో 6.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా టీక్యాతండాలో 5.6 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 5.5, యాదాద్రి జిల్లా మోత్కూరులో 4.5, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 3.7, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో 3.7, ముకుందాపురంలో 3.6, రెడ్డిగూడలో 3.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్ సిటీలోనూ పలు చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆదర్శ్‌నగర్‌లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఫతేనగర్‌లో 3 సెంటీమీటర్లు, కుత్బుల్లాపూర్‌లో 3, బాలానగర్‌లో 2.7, మైత్రీవనంలో 2.6, శ్రీనగర్ కాలనీలో 2.4, బోయినపల్లిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
వర్షాలు తక్కువే..
రాష్ట్రంలో ఈ రెండు వారాల పాటు సాధారణం కన్నా తక్కువ వర్షాలే పడుతాయని ఐఎండీ అంచనాల్లో పేర్కొంది. కేవలం కొంకణ్, గోవా, కర్నాటక, రాయలసీమ, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే సాధారణం లేదా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగతా దేశమంతా లోటు వర్షపాతమే రికార్డ్ అవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్స్ లాంటి పరిస్థితులు ఉంటాయని తేల్చి చెప్పింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో వరుసగా ఈ మూడు రోజుల పాటు హీట్‌వేవ్స్ ఉంటాయని హెచ్చరించింది. చివరి వారంలో ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపింది.
