ఆర్టీఏల్లో అక్రమాలపై విజిలెన్స్ సీరియస్.. అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెన్షన్

ఆర్టీఏల్లో అక్రమాలపై విజిలెన్స్ సీరియస్.. అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే సస్పెన్షన్
  •     టెస్ట్ ట్రాక్​లలో అవకతవకలు, రూల్స్​ బ్రేక్ చేస్తున్నారని గుర్తింపు  
  •     ఏజెంట్ల హవా కంటిన్యూ అవుతుండడంతో ఆగ్రహం 
  •     నిబంధనలు పాటించకపోతే విచారణ, సస్పెన్షన్​​

హైదరాబాద్ ​సిటీ, వెలుగు : గ్రేటర్ పరిధిలోని ఆర్టీఏ ఆఫీసులు, టెస్టు ట్రాక్ లలో జరుగుతున్న అవకతవకలపై విజిలెన్స్ నిఘా తీవ్రతరం చేసింది. డ్రైవింగ్ ట్రాక్ లలో నిర్వహిస్తున్న టెస్టుల్లో కొందరు ఎంవీఐలు రూల్స్​పాటించడం లేదని, డ్రైవింగ్​రాని వారిని కూడా టెస్టుల్లో పాస్ చేసి లైసెన్స్ జారీ చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో సీరియస్​అయ్యింది. 

టెస్ట్ కు అభ్యర్థులు రాకపోయినా లైసెన్స్ ఇస్తున్నారని తెలియడంతో తనిఖీలు చేసి నిజమేనని తేల్చింది. కొందరు అధికారులు ఏజెంట్లతో కుమ్మక్కై ఇలా చేస్తున్నారని గుర్తించింది. ప్రస్తుతం చాలా పనులు ఆన్​లైన్​లోనే జరుగుతున్నా కొన్ని విషయాల్లో తప్పని సరిగా ఆఫీసుకు రావాల్సి వస్తున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏజెంట్లను రంగంలోకి దింపుతున్న కొందరు అధికారులు డీల్​చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

 ఈ నేపథ్యంలోనే విజిలెన్స్​ తనిఖీలు చేయగా నిజమేనని తేలడంతో రూల్స్​పక్కాగా ఫాలో కావాలని హెచ్చరించినట్టు సమాచారం. డ్రైవింగ్​ట్రాక్​లో టెస్ట్​ప్రారంభానికి ముందే ఎంవీఐలు దరఖాస్తుదారుడి ఆధార్​కార్డు, గుర్తింపు కార్డు, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రతి పరీక్ష తర్వాత రిజిస్టర్​లో ఫలితాలు నమోదుచేయాలని, పరీక్షా టైంలో సీసీ టీవీ కెమెరాలు నిరంతరం పని చేస్తుండాలని, నిఘా పరికరాలను ఆపకూడదని వార్నింగ్​ఇచ్చింది.  

డైరెక్ట్​ సస్పెన్షనే..

సిటీలోని ఆర్టీఏ ఆఫీసుల్లోకి ఏజెంట్లను..అలాగే డ్రైవింగ్​ట్రాక్​ప్రాంగణంలోకి  ప్రైవేట్​వ్యక్తులు, బ్రోకర్లు, డ్రైవింగ్​స్కూల్​ప్రతినిధులను రానివ్వకూడదని ఖచ్చిత ఆదేశాలిచ్చారు. 

ప్రైవేట్​వ్యక్తులకు సహకరించినట్టు తెలిసినా,  లావాదేవీలు, చెల్లింపులు జరిపినా సదరు అధికారిపై విచారణ జరపడంతో పాటు సస్పెండ్​ చేయాలని నిర్ణయించారు. డిజిటల్​రికార్డులు, ఫిజికల్​రిజిస్టర్లు రోజువారీగా సరిపోలాలని, ఏ మాత్రం తేడా వచ్చినా ఆర్టీఓకు నివేదించాలన్నారు. నెలవారీ రిపోర్టులను ఎంవీఐలు కమిషనర్​ ఆఫీసుకు పంపించాలన్నారు.