వెలుగు ఓపెన్ పేజీ.. రుతుపవనాలపై ఎల్‌‌నినో ప్రభావం

వెలుగు ఓపెన్ పేజీ.. రుతుపవనాలపై ఎల్‌‌నినో ప్రభావం

అడపాదడపా ప్రకృతి చేసే విలయతాండవంతో  తీవ్రంగా ప్రభావం చూపేవి రెండు రకాల విభిన్న వాతావరణ పరిస్థితులు.‌‌ అందులో ఒకటి ఎల్‌‌నినో కాగా రెండోది లానినో.  ఇవి లిటిల్ బాయ్,  లిటిల్ గర్ల్ అనే అర్థాలు స్ఫురించే  రెండు స్పానిష్ పదాలు.‌‌  సముద్రం పైన ఆవరించి ఉండే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఒడుదొడుకులకు లోనవడం వల్ల ఇవి ఏర్పడతాయి. వీటివల్ల సామాన్య ప్రజానీకం, రైతాంగంతోపాటు ప్రపంచంలోని వివిధ షేర్ మార్కెట్లు కూడా ఎల్‌‌నినో,  లానినా ప్రభావాలకు కుదేలవుతాయి. 

 సహజంగా ఏ ఆర్థికవ్యవస్ధ బలపడాలన్నా రుతుపవన ఆధారిత వర్షపాతం కూడా ఒక ముఖ్యమైన కొలమానం.  పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణతాపం పెరగడం, రుతుపవనాలను  మందగించి వాటి గమనాన్ని తారుమారు చేసి వర్షాభావ పరిస్థితులను కల్పించడం ఎల్‌‌నినో పనితనం.  దీని ప్రభావంతో సగటు కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనబడుతోంది.‌‌ నివురుగప్పిన నిప్పులా వ్యాపించే ఈ వాతావరణ చక్రం సృష్టించే విధ్వంసమే కరువు కాటకాలు.

లానినో  విధానంలో పసిఫిక్ మహా సముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా చల్లబడతాయి. దాని ప్రభావంతో రుతుపవనాలు బలంగా మారి భారీ వర్షాలు, వరదలతో జలప్రళయం జరిగే అవకాశం ఉంటుంది.  ప్రకృతిలో ఈ రెండు విభిన్నమైన వాతావరణ చక్రాలు నిర్దిష్ట సమయాల్లో  సంభవించే విభిన్న ప్రక్రియలు.‌‌ మనదేశంలో కూడా ఎల్‌‌నినో వల్ల  నైరుతీ రుతుపవనాలు ప్రతికూల ప్రభావంతో బలహీనపడితే లానినా వల్ల అవి బలపడతాయి.  ప్రస్తుతం ప్రపంచ వాతావరణ సంస్థ తాజా సమాచారం ప్రకారం  వాతావరణ నమూనాలు భూమధ్యరేఖ పసిఫిక్‌‌ మహాసముద్రంలో అసాధారణ మార్పును సూచిస్తున్నాయి.  

జూన్ నెల నుంచి నవంబర్ నెల మధ్యలో  ఎల్‌‌నినో సంభవించేందుకు 80% అవకాశం ఉందని అంచనా.  నైరుతి రుతుపవనాలు,  వాయువ్య  రుతుపవనాల ద్వారా వర్షాలు కురిసేది సరిగ్గా ఈ సమయంలోనే.  అదే  ప్రస్తుత ఆందోళన.  వేసవికాలం  ముగిసిన ఈ సమయంలో  రైతులతో సహా  అందరూ చర్చించుకునేది  నైరుతి రుతుపవనాల వల్ల వచ్చే వర్షాల గురించి.   కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో తొలి వర్షాలు కురిసి ఆ తరువాత ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల గుండా దేశవ్యాప్తంగా విస్తరించాలి.  ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న రుతుపవనాలు,  తొలకరి జల్లులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. 

అల్పపీడనాలు, తుఫాన్ల వల్ల కూడా వర్షాలు

అప్పుడప్పుడు  ఏర్పడే అల్పపీడనాలు,  తుఫాన్ల వల్ల కూడా వర్షాలు పడుతుంటాయి.  కానీ,  రైతుల  ఆశాకిరణాలు  నైరుతి రుతుపవనాలే.  ఎల్‌‌నినో ప్రభావంతో దానికి గండిపడితే జరగబోయే అనర్థాలను తట్టుకోవడం కష్టతరం. రుతుపవనాలను  ఎల్‌‌నినో  ఎందుకు ప్రభావం చేస్తుందో  తెలియాలంటే.. అసలు  ఎల్‌‌నినో  ఎందుకు,  ఎలా  ఏర్పడుతుంది అనే విషయంపై అవగాహన అవసరం.  సముద్రంపైన ఆవరించే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా అంటే 0.5 డిగ్రీల సెల్సియస్‌‌కు పైగా నమోదు అవుతునప్పుడు, ఉపరితల జలాలు ఎక్కువగా వేడెక్కుతాయి.  

తద్వారా ఏర్పడిన వేడి గాలులు సముద్రంలోని నిర్దిష్ట ప్రాంతాలలో వాతావరణం పైకి లేస్తాయి.‌‌ అప్పుడు కింది భాగంలో ఏర్పడిన ఖాళీ ప్రాంతం  అల్పపీడన ప్రాంతంగా మారి అందులోకి ఇతర ప్రాంతాల నుంచి పయనించి వస్తున్న రుతుపవనాలతో కూడిన చల్లగాలులు, నీటి ఆవిరి వచ్చి చేరిపోతాయి. అటుపైన రుతుపవనాల గమనం అసాధారణ రీతిలో  మార్పులకులోనై  వర్షాభావ పరిస్థితులు ఏర్పడేటట్లు చేస్తాయి.  నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట  ప్రాంతాలకు చేరవలసిన రుతుపవనాలు బలహీనపడి ఇతర ప్రాంతాలకు మళ్లుతాయి. ఇది ప్రమాదకరమైన  పరిస్థితి. 

సూపర్ ఎల్‌‌నినో  అంటే...

భూమధ్యరేఖ ప్రాంత పసిఫిక్ మహాసముద్రంలోని నిర్దిష్ట ప్రదేశంలో ఉపరితల జలాలు మామూలు కన్నా ఏ స్థాయిలో వేడెక్కుతున్నాయే తెలుసుకొని, దాని ఆధారంగా ఎల్‌‌నినో బలాన్ని కొలవడం జరుగుతుంది.  సముద్ర  ఉపరితల ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్  దాటగానే సముద్ర జలాలు వేడెక్కి ఎల్‌‌నినో  ఏర్పడుతుంది. రెండు డిగ్రీల సెల్సియస్‌‌ను దాటితే బలమైన ఎల్‌‌నినో ఉద్భవిస్తుంది. 

దాన్ని సూపర్ ఎల్‌‌నినో అంటారు. అయితే ఎల్‌‌నినో  ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం శాస్త్రజ్ఞులకు కష్టతరమే.‌‌  వాతావరణ శాస్త్రజ్ఞులు వేసిన అంచనాలు దాదాపుగా 60 శాతం మేరకే అనుకున్న ప్రభావం చూపే అవకాశం ఉంది.  కొన్ని సందర్భాలలో అంచనా వేసినంత ప్రభావం కూడా చూపించకపోవచ్చు.  గతానుభవం  ప్రకారం మనదేశంలో ఇంతకుముందు  ఏర్పడిన  ఎల్‌‌నినోల వల్ల కొన్ని సందర్భాలలో మాత్రం వర్షాభావ పరిస్థితులు వంటి దుష్ఫలితాలు సంభవించలేదు. 

ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండాలి

ప్రపంచ వాతావరణ సంస్థ శాస్త్రజ్ఞులు చెబుతున్న ఎల్‌‌నినో అంచనాలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు ప్రణాళికలతో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.  వర్షాభావ  పరిస్థితితో  నీటి కొరత ఏర్పడితే జరిగే అపార నష్టం మనకు  తెలియనిది కాదు.  ప్రకృతితో  పోరాడి ఉపద్రవాలను ఆపలేం కానీ సరైన కార్యాచరణ  పథకాలతో  కూడిన ముందస్తు ఏర్పాట్లతో దాని ప్రభావాన్ని తగ్గించుకోగలం. 150 ఏళ్ల క్రితం  ప్రపంచవ్యాప్తంగా  భారత్‌‌తో సహా అనేక దేశాలలో  సంభవించిన  మహాకరువు ఎల్‌‌నినో  చూపిన ప్రభావమే అన్న విషయం మరవకూడదు. 

వర్షాలు  తగ్గిపోతే  ఖరీఫ్  పంటలైన పత్తి,  మొక్క

జొన్న,  వేరుశనగ,  పప్పుధాన్యాల  ఉత్పత్తిపై  ప్రతి కూల  ప్రభావం పడుతుంది. భూగర్భజలాలు  అడుగంటి  చెరువులు,  రిజర్వాయర్లలో  నీటిమట్టం పడిపోయి  తాగునీటి  కొరత  ఏర్పడుతుంది.  ఎల్‌‌నినో పంజా విసరకముందే ఆహార ధాన్యాల నిల్వలను పెంచుకుంటూ, ‌‌ నీటి సంరక్షణ చర్యలతో పాటు వ్యవసాయంలో  మెలకువలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది.  రైతులు తక్కువ నీటితో  పండే చిరుధాన్యాలు, ఆరుతడి పంటలను ఎంచుకోవాలి.  బిందు సేద్యం ద్వారా సాగునీరు వృథా కాకుండా కాపాడుకోవాలి. 

- ఆర్. సి. కుమార్,సోషల్ ఎనలిస్ట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 

స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.