పార్థిబన్ ‘No కాస్ట్ No రిలిజియన్’ ఉద్యమం.. అందరికీ అందుబాటులోకి వస్తుందా? విజయ్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ?

పార్థిబన్ ‘No కాస్ట్ No రిలిజియన్’ ఉద్యమం.. అందరికీ అందుబాటులోకి వస్తుందా? విజయ్ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ?

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ ప్రారంభించిన ‘కులం లేదు.. మతం లేదు’ (No Caste, No Religion) సర్టిఫికెట్ ఉద్యమం ఇప్పుడు వ్యక్తిగత అంశం నుంచి ప్రజా సమస్యగా మారింది. కేవలం తనకు మాత్రమే కాకుండా, కుల, మత గుర్తింపులకు అతీతంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సర్టిఫికెట్ సులభంగా అందేలా చట్టపరమైన విధానం తీసుకురావాలని పార్థిబన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

పార్థిబన్ PILపై హైకోర్టు స్పందన..

పార్థిబన్ దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను (PIL) సోమవారం (ఆగస్టు 3, 2026న) మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ ఎస్.ఏ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హోం శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖలకు నోటీసులు జారీ చేసింది. ‘నో కాస్ట్.. నో రిలిజియన్’ సర్టిఫికెట్లు పొందాలనుకునే వారికి స్పష్టమైన విధానం ఉండాలని, దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

అందరికీ వర్తించేలా విధానం ఉండాలి..

కేవలం పార్థిబన్‌కు మాత్రమే కాకుండా, సమాజంలో ఎవరైనా తమ కుల, మత గుర్తింపులను వదులుకోవాలని కోరుకుంటే వారికి కూడా ఈ సర్టిఫికెట్ పొందే అవకాశం ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులకు ఇలాంటి సర్టిఫికెట్ల జారీపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో దరఖాస్తులను స్వీకరించడంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయని పార్థిబన్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు, విధానాలను రూపొందించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ప్రత్యేక చట్టం కోసం పార్థిబన్ విజ్ఞప్తి..

కుల, మత గుర్తింపులను తొలగించుకోవాలనుకునే పౌరులకు ‘నో కాస్ట్.. నో రిలిజియన్’ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను చట్టబద్ధం చేయాలని పార్థిబన్ తన పిటిషన్‌లో కోరారు. గతంలో 2025లో మద్రాస్ హైకోర్టు ఇలాంటి దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ, మార్గదర్శకాల అమలులో ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

వ్యక్తిగత అంశం నుంచి ప్రజా సమస్యగా..

కొన్ని నెలల క్రితం ఓ సినిమా కార్యక్రమంలో తన కుల ప్రస్తావనపై పార్థిబన్ వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. అయితే ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. అనంతరం తాను అధికారికంగా కుల, మత గుర్తింపులు లేని వ్యక్తిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జాప్యం జరగడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు జోక్యంతో షోలింగనల్లూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆయనకు ‘కులం లేదు, మతం లేదు’ సర్టిఫికెట్ జారీ అయింది. ఇప్పుడు ఇదే విధానం రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పౌరుడికి అందుబాటులో ఉండేలా చట్టపరమైన పరిష్కారం కోసం పార్థిబన్ పోరాడుతున్నారు.

ALSO READ : జాబ్ ఇస్తామంటే వెళ్లారా.. నరకంలో పడ్డట్టే..

విజయ్ సర్కార్ నిర్ణయంపై ఆసక్తి ?

తమిళనాడు సీఎం దళపతి విజయ్.. ఇప్పటికే తన రాజకీయ ప్రయాణంలో సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. కుల, మత ఆధారిత విభజనలకు వ్యతిరేకంగా ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను సైతం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ‘No Caste, No Religion’ వంటి ఉద్యమాలకు విజయ్ మద్దతు ఇస్తారా? లేక దీనిపై ప్రభుత్వం స్థాయిలో చర్చ అవసరమని భావిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పార్థిబన్.. నటుడిగా, దర్శకుడిగా తన ప్రయోగాత్మక చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే, పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు.