Job Trafficking: జాబ్ ఇస్తామంటే వెళ్లారా.. నరకంలో పడ్డట్టే.. 'జాబ్ ట్రాఫికింగ్'తో ప్రైమ్ వీడియో షాక్!

Job Trafficking: జాబ్ ఇస్తామంటే వెళ్లారా.. నరకంలో పడ్డట్టే.. 'జాబ్ ట్రాఫికింగ్'తో ప్రైమ్ వీడియో షాక్!

హై సాలరీ జాబ్... విదేశాల్లో సెటిల్ లైఫ్... అని కలలు కంటూ ఇంటి నుంచి బయల్దేరిన యువకులు.. చివరకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సైబర్ మోసాల గ్యాంగ్‌లకు బానిసలైతే? అది వారిని ఊపిరాడనివ్వకుండా చేసే నరకకూపంగా మార్చుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైబర్ క్రైమ్స్ వెనుక ఉన్న భయానక నిజాలను కళ్లకు కట్టేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో సిద్ధమైంది. 'జాబ్ ట్రాఫికింగ్' (Job Trafficking) పేరుతో మైండ్ బ్లాక్ అయ్యే సర్వైవల్ డ్రామాను అనౌన్స్ చేస్తూ తొలి గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.

దర్శకుడు ప్రశాంత్ నాయర్ తెరకెక్కిస్తున్న ఈ ఎనిమిది ఎపిసోడ్‌ల సర్వైవల్ థ్రిల్లర్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 'ఒక అవకాశం... ప్రాణాల కోసం పోరాటంగా ఎలా మారింది?' అనే కాన్సెప్ట్‌తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న 'పిగ్ బుచరింగ్' అనే సైబర్ మోసం గురించి చాలా మందికి తెలుసు. సోషల్ మీడియాలో స్నేహం, ప్రేమ పేరుతో నెలల తరబడి నమ్మకం సంపాదించి చివరకు కోట్ల రూపాయలు దోచేసే ఈ మోసాల వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని 'జాబ్ ట్రాఫికింగ్' ఆవిష్కరించనుంది.

అయితే ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే... మోసగాళ్ల కథను కాదు, ఉద్యోగాల పేరుతో విదేశాలకు మోసపోయి బలవంతంగా సైబర్ నేరాలకు పాల్పడాల్సి వచ్చిన వారి దారుణ జీవితాన్ని చూపించబోతోంది. ఈ కథలో స్వేచ్ఛ కోసం తపించే ఓ సైబర్ మోసగాడు, మోసానికి గురై నిజం కోసం వెతికే ఓ గృహిణి, అనుకోకుండా ఈ చీకటి వలయంలో చిక్కుకునే ఓ సీఈఓ జీవితాలు ఒకే దారిలో కలుస్తాయి. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్తాయని సమాచారం.

నిమ్రత్ కౌర్, రోషన్ మాథ్యూ, కావ్య త్రేహన్, పవన్ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్, చాక్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కథలోని అసలు ట్విస్టులను గోప్యంగా ఉంచిన మేకర్స్, ఒక్క గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు పెంచేశారు. సైబర్ క్రైమ్ వెనుక దాగిన అసలు భయానక ప్రపంచాన్ని చూపించే ఈ థ్రిల్లర్ కోసం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.