ముంబైలోని ఓ ఫెమస్ స్వీట్ షాపులో దారుణం వెలుగు చూసింది. చార్ని రోడ్డులోని ఒపెరా హౌస్ ఏరియాలో ఉన్న ప్రముఖ 'తెవారీ బ్రదర్స్ స్వీట్స్' షాపులో కొన్న కాజు కట్లీలో తుప్పు పట్టిన మెటల్ పిన్ను రావడం కలకలం సృష్టించింది.
ముంబైకి చెందిన ప్రణయ్ పలావ్ అనే వ్యక్తి జూలై 29న ఈ షాపులో మోతీచూర్ లడ్డూలు, కాజు కట్లీ కొనుగోలు చేశారు. అయితే ఇంట్లో కుటుంబంతో కలిసి కాజు కట్లీ తింటుండగా.. ఒక ముక్కలో తుప్పు పట్టిన మెటల్ పిన్ను గుచ్చుకోవడం ఆయన గుర్తించారు. ఆ స్వీట్‌ను తన మూడేళ్ల చిన్నారికి తినిపించే లోపు ఈ విషయం గమనించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వీట్ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
వంటగదిలో దారుణమైన పరిస్థితులు..
ఈ ఘటనపై షాపునకు వెళ్లిన ఆ కస్టమర్ వంటగది లోపలి దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వంటగది పక్కనే టాయిలెట్ ఉన్నట్లు, గ్యాస్ స్టవ్‌పై ఉన్న కడాయిలో నేలను శుభ్రపరిచే గుడ్డ లాంటి దాన్ని ఉడకబెడుతున్నట్లు అపరిశుభ్రమైన దృశ్యాలు కనిపించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. ఈ ఘటనపై బాధితుడు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై ఎఫ్డీఏ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై తెవారీ బ్రదర్స్ షాప్ యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
