UPI పేమెంట్లలో మార్పు.. ఒక్క క్లిక్‌తో మీ డబ్బు సేఫ్.. ఇకపై 'Yes' చెప్పాల్సిందే!

UPI పేమెంట్లలో మార్పు.. ఒక్క క్లిక్‌తో మీ డబ్బు సేఫ్.. ఇకపై 'Yes' చెప్పాల్సిందే!

దేశంలో డిజిటల్ చెల్లింపులతో పాటు అంతే వేగంగా UPI మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కీలక ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సమర్పించాయి. దీని ప్రకారం ప్రతి UPI లావాదేవీకి కాదు.. కేవలం అనుమానాస్పదంగా కనిపించే ట్రాన్సాక్షన్‌లకు మాత్రమే అదనపు నిర్ధారణ(Confirmation) తీసుకోవాలని సూచించాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కొన్ని చెల్లింపుల సమయంలో వినియోగదారులు "Yes" లేదా "No" అనే పాప్-అప్‌ను చూడొచ్చు రానున్న రోజుల్లో.

కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?
మీరు చేసే UPI పేమెంట్ బ్యాంక్‌కు అనుమానాస్పదంగా అనిపిస్తే.. ఆ ఖాతాకు డబ్బును వెంటనే పంపకుండా ముందుగా కస్టమర్ కు కన్ఫర్మేషన్ కోసం సందేశం కనిపిస్తుంది. "మీరు నిజంగానే ఈ చెల్లింపును చేయాలనుకుంటున్నారా?" అనే తరహాలో పాప్-అప్ వస్తుంది. వినియోగదారు "Yes" నొక్కిన తర్వాత మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఒకవేళ "No" ఎంచుకుంటే చెల్లింపు నిలిచిపోతుంది.

ప్రతి చెల్లింపునకూ కాదు..
ఈ అదనపు కన్ఫర్మేషన్ అనేది అన్ని UPI లావాదేవీలకు వర్తించదు. బ్యాంకుల ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ అనుమానాస్పదంగా గుర్తించిన ట్రాన్సాక్షన్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతో సాధారణ రోజువారీ చెల్లింపులు మునుపటిలాగే వేగంగా పూర్తవుతాయి.

►ALSO READ | SIR ఫారమ్ సైబర్ మోసాలు.. రూ.5 ఫీజు కట్టాలంటూ రూ.3.49 లక్షలు కాజేశారు.. ఇలా జాగ్రత్తపడండి

ఎందుకు ఈ మార్పు?
ప్రస్తుతం జరుగుతున్న చాలా UPI మోసాల్లో హ్యాకింగ్ కంటే మోసగాళ్లు ఫోన్ కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, వాట్సాప్ మెసేజీలు, ఇతర సోషల్ ఇంజినీరింగ్ పద్ధతుల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. అత్యవసరమని చెప్పి వెంటనే డబ్బు పంపించేలా ఒత్తిడి చేస్తారు. ఒకసారి UPI ద్వారా డబ్బు పంపితే తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే చెల్లింపునకు ముందు ఒక అదనపు నిర్ధారణ ఉంటే.. వినియోగదారుడు మరోసారి ఆలోచించే అవకాశం లభిస్తుందని బ్యాంకులు భావిస్తున్నాయి. అంటే పాపప్ వచ్చింది అంటే ఆ అకౌంట్ కి డబ్బులు పంపే విషయంలో కస్టర్ జాగ్రత్తపడాలని అర్థం. దీనిని హెచ్చరికగా ప్రజలు గుర్తించి వారు ఎవరికి ఎందుకు డబ్బులు పంపిస్తున్నారనే విషయాలను పరిశీలించుకోమని హెచ్చరిక అన్నమాట.

ఏ ట్రాన్సాక్షన్‌లు అనుమానాస్పదంగా పరిగణిస్తారు?
బ్యాంకులు ఇప్పటికే వినియోగదారుల లావాదేవీలను విశ్లేషించే ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయి. వాటి ప్రకారం కింది పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్‌ను హైరిస్క్ అని గుర్తించే అవకాశం ఉంటుంది.

* అసాధారణంగా ఎక్కువ మొత్తం పంపించడం
* తొలిసారి కొత్త వ్యక్తికి డబ్బు పంపించడం
* కొత్త మొబైల్ లేదా డివైస్ నుంచి చెల్లింపు చేయడం
* ఎప్పుడూ ఉపయోగించని ప్రాంతం నుంచి ట్రాన్సాక్షన్ జరగడం
* సాధారణ ఖర్చు విధానానికి పూర్తిగా భిన్నంగా లావాదేవీ ఉండడం. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే "Yes/No" నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది.

హైవాల్యూ చెల్లింపులన్నింటికీ ఆలస్యం లేదా తప్పనిసరి కూలింగ్ పీరియడ్ విధించాలనే ఆలోచనను బ్యాంకులు వ్యతిరేకించాయి. ఎందుకంటే UPI సక్సెస్ కావటానికి ప్రధాన కారణం స్పీడ్. ప్రతి చెల్లింపునూ ఆలస్యం చేస్తే వినియోగదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అవసరమైన చోట మాత్రమే అదనపు భద్రత కల్పించే విధానాన్ని ప్రతిపాదించాయి భారతీయ బ్యాంకులు.

బ్యాంకులు సమర్పించిన ఈ ప్రతిపాదనను ప్రస్తుతం RBI పరిశీలిస్తోంది. పేమెంట్ కోసం యెస్ అని కస్టమర్ నుంచి ఆమోదం వల్ల UPI చెల్లింపుల్లో భద్రత మరింత పెరగడంతో పాటు, మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. సామాన్య వినియోగదారుడికి ఇది ఒక అదనపు క్లిక్ మాత్రమే అయినా, సైబర్ మోసాల నుంచి డబ్బును కాపాడే కీలక రక్షణగా మారే అవకాశం ఉంది.