SIR ఫారమ్ సైబర్ మోసాలు.. రూ.5 ఫీజు కట్టాలంటూ రూ.3.49 లక్షలు కాజేశారు.. ఇలా జాగ్రత్తపడండి

SIR ఫారమ్ సైబర్ మోసాలు.. రూ.5 ఫీజు కట్టాలంటూ రూ.3.49 లక్షలు కాజేశారు.. ఇలా జాగ్రత్తపడండి

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటరు జాబితా(SIR) సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సంఘం అధికారులమంటూ ఫోన్ చేసి.. SIR ఫారమ్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని నమ్మించి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. బెంగళూరులో 82 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.3లక్షల 49వేలు కాజేసిన ఘటన వెలుగులోకి రావటంతో ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన సమయం వచ్చేసింది.

ఎలా మోసం చేశారు?
బెంగళూరుకు చెందిన ఆర్. పార్థసారథి అనే వ్యక్తికి ఎన్నికల సంఘం అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. SIR వెరిఫికేషన్ పూర్తి కాలేదని, వెంటనే ప్రక్రియ పూర్తి చేయకపోతే ఓటరు నమోదులో సమస్యలు వస్తాయని చెప్పాడు. దీనిని పూర్తి చేసేందుకు రూ.5 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించాడు. వెరిఫికేషన్ కోసం ఒక మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేయించాడు. పేమెంట్ ఫెయిల్ కావటంతో వాట్సాప్ ద్వారా QR కోడ్ పంపించాడు. స్కామర్ పంపిన యాప్, QR కోడ్ ద్వారా ఫోన్, బ్యాంకింగ్ వివరాలను తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు నేరగాళ్లు. ఈ తర్వాత వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.3 లక్షల 49వేలు తస్కరించారు. మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్ల మోసం ఇలా ఉంటుంది:

సైబరాబాద్ పోలీసులు, సైబర్ భద్రత నిపుణులు వెల్లడించిన వివరాల ప్రకారం నేరగాళ్లు సాధారణంగా..
* ఎన్నికల సంఘం(ECI) అధికారులు లేదా BLOలమని చెబుతారు.
* ఓటరు జాబితా వెరిఫికేషన్ టీమ్ సభ్యులమని నమ్మిస్తారు.
* ప్రభుత్వ శాఖ నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు.
* వాట్సాప్‌లో లింకులు లేదా APK ఫైళ్లు పంపిస్తారు.
* SIR కింద ఓటరు వివరాలు అప్‌డేట్ చేయండి అని సూచిస్తారు.
* కొత్త ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి అని చెబుతారు.
* ఓటర్ ఐడీ KYC పూర్తి చేయండి అంటూ ఒత్తిడి చేస్తారు.

గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు:

* SIR వెరిఫికేషన్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఎన్నికల సంఘం వాట్సాప్ ద్వారా వెరిఫికేషన్ చేయదు.
* APK ఫైళ్లు లేదా యాప్‌లను పంపదు.
* OTP, బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం ఫోన్‌లో అడగదు.

నకిలీ యాప్‌లు ఏం చేస్తాయి?

ఒకసారి నకిలీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే...
* వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి.
* ఫోటోలు, కాంటాక్ట్‌లను కాపీ చేస్తాయి.
* UPI, బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తాయి.
* ఫోన్‌పై పూర్తి నియంత్రణ పొందే ప్రమాదం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి:

సైబర్ నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన భద్రతా సూచనలు ఇవే..
1. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, యాప్‌లను మాత్రమే ఉపయోగించండి.
2. తెలియని వ్యక్తులు పంపిన లింకులు క్లిక్ చేయవద్దు.
4. OTP, బ్యాంక్ వివరాలు, ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దు.
5. SIR వెరిఫికేషన్ పేరుతో డబ్బు అడిగితే వెంటనే తిరస్కరించండి.
6. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.

SIR పేరుతో జరుగుతున్న మోసాల్లో నేరగాళ్లు ప్రజలకు సరైన అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా మార్చుకుంటున్నారు. ఎన్నికల సంఘం పేరుతో వచ్చే ప్రతి కాల్, లింక్ లేదా యాప్‌ను నమ్మకుండా అధికారిక మార్గాల ద్వారానే వెరిఫికేషన్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చు.