పోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం

పోక్సో కేసులో  20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం

ములుగు/మంగపేట, వెలుగు : పోక్సో కేసులో నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తూ జిల్లా జడ్జి ఎస్​వీపీ సూర్యచంద్రకళ గురువారం తీర్పు వెలువరించారు.   ఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​ మీడియాకు వివరించారు.

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కన్నెబోయిన సమ్మయ్య గిరిజన మైనర్​ బాలికపై అత్యచార యత్నం చేశాడని ఆరోపిస్తూ 2023లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఫాస్ట్ ట్రాక్​ పోక్సో కోర్టులో  కేసు విచారణ జరిగింది.  నేరం నిరూపణ కావడంతో గురువారం జిల్లా జడ్జి ఎఎస్​వీపీ సూర్య చంద్రకళ నిందితునికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20వేల జరిమానా, బాధితురాలికి రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తుదితీర్పు వెలువరించారు.

నేరం నిరూపణ, దోషికి శిక్షపడటంలో కీలకంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారి అప్పటి ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్​, డీఎస్పీ కిషోర్​ కుమార్​, కోర్టు లైసనింగ్​ ఆఫీసర్​ ఎస్సై నాగరాజు, సీడీవో మౌనికలను జిల్లా ఎస్పీ అభినందించారు. మైనర్లపై నేరాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని, బాధితులకు న్యాయం కల్పించడానికి పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఇలాంటి నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని
 ఎస్పీ హెచ్చరించారు.