ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపర్చడం, సేవల నాణ్యతలను పెంచడం అనే అంశంపై హెల్త్ కేర్ క్వాలిటీ డైలాగ్ -2026 పేరుతో ఇటీవల ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సహకారంతో హైదరాబాద్‌లో జాతీయ సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ ఎయిమ్స్, ప్రైవేట్ రంగాల్లోని వాడియా, వేదాంత, కేర్, అపోలో వంటి ప్రముఖ ఆసుపత్రుల వైద్యులందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు.
కృత్రిమ మేధ, రోబోటిక్ సేవలు, ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి, ఐసీయూలో చేరే రోగులకు మెరుగైన చికిత్స అందించడం, మరణాల రేటును తగ్గించడం, ఇన్సిడెంటల్ రిపోర్ట్ పైన, నర్సింగ్ సేవలుపైనా చర్చలు జరిగాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో ఉండేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాట్-ఫర్-ప్రాఫిట్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం చేయూత, వైద్యసేవల్లో ప్రామాణికత, హెల్త్ ఇన్సూరెన్స్, డిజిటల్ వైద్యం వంటి అంశాలతోపాటు యోగ ఆసనాల ప్రాముఖ్యతపై విస్తృతంగా చర్చించడం విశేషం.
క్వాలిటీ కౌన్సిల్ అఫ్ ఇండియా సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన, ‘నాబ్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ గిరిధర్ జ్ఞాని కీలక అంశాలు సదస్సులో ప్రస్తావించారు. వైద్యరంగంలో 'క్వాలిటీ మేన్ ఆఫ్ ఇండియా'గా ఆయనకు పేరుంది. దేశంలోని ఆరోగ్య రంగంలో నాణ్యత, రోగి భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్ సమస్యలు, సస్టైనబుల్ హెల్త్‌కేర్ గురించి మాట్లాడారు.
నాణ్యమైన వైద్యం ఖర్చుతో కూడుకున్నదే, కానీ నాణ్యతలేని వైద్యం ప్రాణాలను కోల్పోయేలా చేస్తుందని ఆయన చెప్పిన విషయంపై కార్పొరేట్ ఆసుపత్రులు ఎంతగానో ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రుల్లో పడకలు, నిపుణులైన వైద్యులు, గ్రామీణప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెరగాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ప్రతి వెయ్యిమందికి 3 ఎమర్జెన్సీ పడకలు ఉండాలి. కానీ చాలా రాష్ట్రాలలో ఈ పరిస్థితి లేదు.
ఆయుర్వేదం, యునానీ,హోమియోపతిలను ప్రోత్సహించాలి
ఒక్క కర్నాటక రాష్ట్రంలోని ప్రతి వెయ్యిమందికి 4 పడకలు ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 పడకలు, బిహార్లో 0.2 శాతం పడకలే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో పడకలున్నా.. బిహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రజలు వైద్యం కోసం ఢిల్లీ రావడంతో ఢిల్లీలో ఎప్పుడు పడకలు లభ్యమవుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ఆయుష్మాన్ భారత్ అంటే కొత్త బిల్డింగులు కాదు చిన్న పట్టణాల్లో డాక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి.
ప్రస్తుతమున్న హెల్త్ సెంటర్లను బాగు చేయడం ద్వారా గ్రామాలకే వైద్యాన్ని తీసుకెళ్లినట్టు అవుతుంది. హెల్త్ చెకప్‌లకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు గ్రామీణ హెల్త్‌కేర్ బలోపేతం చేయాలి. డిజిటల్ హెల్త్‌కేర్ అడాప్ట్ చేయడం, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించాలి. వైద్యం చౌకగా అందిస్తే సరిపోదు, నాణ్యతతోపాటు దీర్ఘకాలం నిలిచే వ్యవస్థ కావాలి.
2005లో మెడికల్ టూరిజం కోసం నేషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. మొదటి 5 హాస్పిటల్స్‌కు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో వందలు, వేలకోట్ల రూపాయలతో రూపొందించిన ప్రాజెక్టులు ఉన్నా.. అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ అమలులో నిర్లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ సేవలు పేదప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో రాకపోవడానికి ఆ పథకం అమలులో నిర్లక్షమే ప్రధాన కారణం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆరోగ్య శ్రీ పధకం కేవలం 40 శాతం మందికే అందుబాటులో ఉంది. ఉన్నతవర్గాలు కూడా ఈ పథకం కింద ఆరోగ్యశ్రీ కార్డులు పొందిన కారణంగా పాక్షికంగానే ఈ పథకం అమలవుతున్నదని డాక్టర్ గ్యాని వెల్లడించారు. ఆసుపత్రుల్లో అత్యవసర సేవల విషయంలో నీతి ఆయోగ్, ఎయిమ్స్ 2021 లెక్కల ప్రకారం జిల్లా హాస్పిటల్స్‌లో కేవలం 3-5% బెడ్స్ మాత్రమే ఎమర్జెన్సీకి రిజర్వ్ చేశారు. 88% హాస్పిటల్స్‌లో అంబులెన్స్ ఉన్నా 3% మాత్రమే శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు.
94% హాస్పిటల్స్‌లో పాయింట్-ఆఫ్-కేర్ ల్యాబ్స్ లేవు. దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని మొత్తం హాస్పిటల్ బెడ్స్‌లో 65-–70% ప్రైవేట్ సెక్టార్‌లోనే ఉన్నాయి. ఇన్-పేషెంట్ కేర్‌లో 60%, అవుట్-పేషెంట్ కేర్‌లో 75% ప్రైవేట్ హాస్పిటల్స్ చూస్తున్నాయి. ఆరోగ్య ఖర్చులో 70% పైగా ప్రైవేట్ సెక్టార్‌కే వెళ్తోంది. దీనిలో 80% ప్రజలు తమ జేబుల్లోంచి కడుతున్నారు.
నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే 86% కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. చాలా ఆసుపత్రుల్లో పారదర్శకత లేదు. ప్యాకేజీ రేట్లు, డాక్టర్ ఫీజులు ముందు చెప్పరు. ఓవర్- చార్జింగ్ ఫిర్యాదులు ఎక్కువ. 70% ప్రైవేట్ హాస్పిటల్స్ పట్టణాల్లోనే ఉన్నాయి. పట్టణాల్లో మంచి హాస్పిటల్స్, స్పెషలిస్టులు ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బేసిక్ హెల్త్‌కేర్ సెంటర్లు కూడా సరిగా లేవు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర
డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం భారతదేశానికి 10 లక్షల మంది డాక్టర్స్ కావాలి. ప్రపంచంలో అత్యధిక నర్సింగ్ సిబ్బంది కొరత ఉన్న దేశాల్లో భారత్ 2 వ స్థానంలో ఉన్నది. అలాగే క్వాలిటీ ఆఫ్ కేర్ విషయంలో ఆసుపత్రుల్లో పరిస్థితి నామమాత్రంగానే ఉన్నది. నాబ్ అక్రిడిటేషన్ సర్టిఫికేషన్ కేవలం 3% హాస్పిటల్స్‌కే ఉంది. దేశంలో కేవలం 15% మంది మాత్రమే రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకుంటున్నారు.
భవిష్యత్తులో వైద్యరంగం పూర్తిగా డిజిటల్, సాంకేతిక ఆధారితంగా మారబోతోంది ముఖ్యంగా ఆరోగ్య సమాచార నిర్వహణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, కృత్రిమ మేధస్సు, రోబోటిక్ వైద్యం, డేటా ఆధారిత వైద్య సేవల ప్రాధాన్యత పెరగనుంది. పేపర్ రికార్డుల స్థానంలో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (ఈహెచ్‌ఆర్) వస్తాయి. రోగి వైద్య చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా వెంటనే అందుబాటులో ఉంటుంది. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వైద్యుల నిర్ణయాలకు సహకరించడం, రోబోటిక్ మెడిసిన్ అత్యంత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు, వేగంగా కోలుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఏఐ వినియోగం జరగనుంది.
నీతి ఆయోగ్ ప్రత్యేక సిఫార్సులు
నాట్-ఫర్ -ప్రాఫిట్ హాస్పిటల్స్‌కు స్థిరమైన ఆదాయం ఉండదు. డాక్టర్లు, నర్సులు తక్కువ జీతాలకు పనిచేయాలి. స్టాఫ్ రిటెన్షన్ పెద్ద సమస్య. అధునాతన పరికరాలు కొనడానికి డబ్బు ఉండదు. వీటికి ప్రత్యేక చట్టపరమైన కేటగిరీ ఇవ్వాలి అని నీతి ఆయోగ్ ప్రత్యేక సిఫార్సులు చేసింది. పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి.
ఆయుష్మాన్ భారత్‌లో వీటిని ఎక్కువగా ఎంపానెల్ చేయాలి. ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాలు పెంచాలి. ఇక ఐసీయూలో చేరిన రోగి బతికే చాన్సు పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ‘కేర్ మోడల్స్’ వాడుతున్నారు. ఈ కారణంగా మరణాల రేటు 30% తగ్గుతుంది. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో నర్సింగ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. వైద్య రంగంలో ఎంతో విలువైన సమాచారం ప్రజలకు తెలిసేవిధంగా నిర్వహించిన ఆర్గనైజింగ్ కమిటీకి చెందిన డాక్టర్ కల్నల్ కే.కమలాకర్, డాక్టర్ ఎన్.యోబు, విక్రాంతి కుమార్‌ను అభినందనలు. ‘చౌకగా వైద్యం ఇస్తే సరిపోదు. నాణ్యత ఉండాలి. అదే సస్టైనబుల్ హెల్త్‌కేర్’.
నాట్-ఫర్ -ప్రాఫిట్ హాస్పిటల్స్
దేశంలోని నాట్ -ఫర్- ప్రాఫిట్ హాస్పిటల్స్‌లో మొత్తం బెడ్లలో 10-–15% వరకు ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్‌తో పోలిస్తే 40-–60% తక్కువ ఛార్జీలు. క్లినికల్ అవుట్‌కమ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్‌తో సమానం. కేవలం ట్రీట్‌మెంట్ కాదు. ప్రివెంటివ్ కేర్, కమ్యూనిటీ హెల్త్, సామాజిక సంస్కరణ కూడా చేస్తాయి. కూకట్‌పల్లిలోని రాందేవ్ రావు హాస్పిటల్లో జరుగుతున్న సేవలను ఇందుకు ఉదాహరణగా జాతీయ సదస్సులో పలువురు పేర్కొనడం గమనించదగ్గ విషయం.
ప్రజలకు చౌకగా ఆరోగ్య సేవలు అందించడం పట్ల పలువురు రాందేవ్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది. అయితే ప్రభుత్వ పాలసీల్లో నాట్- ఫర్- ప్రాఫిట్ హాస్పిటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం విచారకరం. ప్రభుత్వ హాస్పిటల్స్లానే ట్రీట్ చేసినా ఇవి విరాళాలు, సీఎస్ఆర్ ఫండ్స్ మీద ఆధారపడాలి. ఈ నేపథ్యంలో నాట్- ఫర్ -ప్రాఫిట్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి.
బాలినేని నాగభూషణ రావు,సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
