గుడ్ న్యూస్.. పీఎఫ్ ఖాతాల్లోకి త్వరలో వడ్డీ జమ..వడ్డీ రేటు 8.25 శాతానికి కేంద్రం ఆమోదం

గుడ్  న్యూస్.. పీఎఫ్ ఖాతాల్లోకి త్వరలో వడ్డీ జమ..వడ్డీ రేటు 8.25 శాతానికి  కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.  2025–26  ఆర్థిక సంవత్సరానికి గాను  ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లకు  ఈ వడ్డీ రేటు అమలవుతువంది.  వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో కూడా వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు.  దేశంలోని దాదాపు 7 కోట్లకు పైగా ఉన్న ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ మెంబర్లు లాభపడతారు.  

వడ్డీ మొత్తాన్ని ఈ నెలలోనే  ఉద్యోగుల పీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.  కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఏడాది మార్చిలో  జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ వడ్డీ రేటును ఖరారు చేశారు. 2023–24, 2024–-25 ఆర్థిక సంవత్సరాల్లో కూడా ఇదే వడ్డీని కొనసాగించారు.  ఈసారి వడ్డీ రేటు ఆమోదం పొందిన వెంటనే సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల ఖాతాల్లోకి నిధులు జమ అవుతుంది . 

భారత ప్రభుత్వం ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌కి గ్యారెంటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తోంది. కాబట్టి, సీబీటీ నిర్ణయించిన రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఆ ప్రక్రియ పూర్తయింది.