దేశంలో పార్టీలకు ఓట్ల సమయంలో మాత్రమే సామాజిక న్యాయం నినాదం గుర్తుకువస్తుందన్న విమర్శలు బహుజన మేధావులలో వినిపిస్తుంటుంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాన్ని నినాదంగా వాడారు. అయితే, దేశ చరిత్రలో ప్రప్రథమంగా దశాబ్దంన్నర కాలంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే.
సామాజిక న్యాయ అంశాన్ని తన రాజకీయ జీవితంలో ముఖ్యమైనదిగా రాహుల్ గాంధీ మార్చుకున్నారు. సామాజిక న్యాయం కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమేనా, లేదా నిజమైన సైద్ధాంతిక నిబద్ధతా అన్న చర్చ దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో... అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ తన నిరంతర ఆచరణ ద్వారా తన నిజాయితీ చాటుకుంటున్న నేత రాహుల్ గాంధీ.
గాంధీ కుటుంబానికి చెందిన వారసుడిగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ తొలి రోజులలో పదునైన రాజకీయ పటిమ లేదని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే 2018 తర్వాత ముఖ్యంగా భారత జోడో యాత్ర అనంతరం ఆయన సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధత అనేకసార్లు చాటుకున్నారు.
భారత సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థను రాహుల్ గాంధీ అన్ని సమస్యలకు మూలంగా చూస్తారు. ఆర్థిక అసమానత మాటున కుల అసమానత దాగి ఉందని, దాన్ని గుర్తించకుండా నిజమైన సంస్కరణ సాధ్యం కాదని రాహుల్ గాంధీ బలంగా నమ్ముతున్నారు. ఇందుకే ఆయన కులగణన అంటే కుల ఆధారిత జనాభా లెక్కలు తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యలో, రాజకీయ ప్రాతినిధ్యంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వాస్తవ స్థితి ఏమిటో అర్థం చేసుకోవాలంటే ఈ గణన అత్యవసరమని ఆయన వాదన. దేశ జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు అధికారంలో, వనరులలో న్యాయమైన వాటా దక్కడం లేదు అని ఆయన పార్లమెంటు వేదికగా పదే పదే ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర రాహుల్ సామాజిక న్యాయ దృక్పథానికి సజీవ వ్యక్తీకరణగా నిలిచింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్లు నడిచిన ఆ యాత్రలో ఆయన మూడు ప్రధానాంశాలు.. ఆర్థిక అసమానత, మత విద్వేషం, నిరుద్యోగంను లేవనెత్తారు. ఈ యాత్రలో రాహుల్ మారుమూల గ్రామాల రైతులతో, కార్మికులతో, పేదలతో నేరుగా సంభాషించారు. పేద ప్రజల బాధలను, కన్నీళ్లను స్వయంగా చూసిన రాహుల్ గాంధీ తన జీవిత రాజకీయ ఎజెండాగా మార్చుకున్నారు.
అసమానతలను రూపుమాపడమే..భారత్ జోడో యాత్ర లక్ష్యం
భారత వ్యవస్థలో పేరుకుపోయిన అసమానతలను రూపుమాపడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం అన్న ఆయన మాటలు లక్షలాది మందిని కదిలించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ పత్రం పథకం ఆయన ఆర్థిక న్యాయ సిద్ధాంతానికి నిదర్శనం. దేశంలోని అట్టడుగు 20 శాతం కుటుంబాలకు నెలకు ఐదు వేల రూపాయల నగదు బదిలీ చేయాలన్న ఈ ప్రతిపాదన, కేవలం సంక్షేమ పథకం కాదు, అది సంపద పునఃపంపిణీ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇది రాహుల్ ఆర్థిక న్యాయ నిబద్ధత ఒక ఎన్నికల వ్యూహం మాత్రమే కాదని రుజువు చేస్తోంది. మహిళా సాధికారత విషయంలో రాహుల్ గాంధీ వైఖరి కూడా విశిష్టంగా ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆయన సమర్థించడమేకాక, ఓబీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించకపోతే ఆ చట్టం అసంపూర్ణంగా ఉంటుందని వాదించారు. ఇది మహిళా సమస్యను కుల కోణం నుంచి చూసే ఆయన దృష్టికి నిదర్శనం. పార్టీ నిర్మాణంలో కూడా మహిళలకు నాయకత్వ స్థానాలు ఇవ్వాలని ఆయన నిరంతరం నొక్కి చెబుతారు. కేవలం ప్రసంగాలలో మాత్రమే కాదు, తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో కూడా ఈ విలువలు ప్రతిఫలించాలని ఆయన కోరతారు.
రాజ్యాంగమే ఆయుధం
రాహుల్ గాంధీ తన ప్రతి ప్రసంగంలో భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమానత్వాన్ని, లౌకిక విలువలను, మైనారిటీల హక్కులను ఎలా పరిరక్షిస్తుందో వివరిస్తారు. విడమరిచి చెబుతారు. పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని ప్రదర్శించడం కేవలం ఒక చర్య కాదు, అది ఒక స్పష్టమైన రాజకీయ సందేశం.
మైనారిటీలపై వివక్ష, హింస, మతం పేరిట జరుగుతున్న విభజన ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఘాటుగా విమర్శిస్తారు. భయం లేకుండా జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది అన్నది ఆయన నమ్మే విశ్వాసం. అది ఏ మతానికి చెందిన వారైనా సరే అని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. కులాధారిత అసమానతలు, వివక్ష ఈ కాలంలో కూడా కొనసాగుతున్నాయన్న వాస్తవాన్ని విస్మరించలేం. సంప్రదాయ కాంగ్రెస్ రాజకీయాలను నేటి ఆధునిక పరిస్థితులకనుగుణంగా అప్డేట్ చేస్తున్న రాహుల్ గాంధీ నేడు 57వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుందాం.
సామాజిక న్యాయంపై చర్చ రాహుల్ విజయం
రాహుల్ గాంధీ సామాజిక న్యాయ దృక్పథం భారత రాజకీయ చర్చను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. కులగణన, ఆర్థిక సమానత్వం, మత సహనం, మహిళా సాధికారత ఈ నాలుగు అంశాలను ఒకే సూత్రంతో అనుసంధానించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు గెలవచ్చు గెలవకపోవచ్చు వాటితో పట్టింపు లేకుండా దేశంలో గుణాత్మక మార్పు కోసం పరితపిస్తున్న సిసలైన దేశ భక్తుడు రాహుల్ గాంధీ.
కులగణనను తొలుత వ్యతిరేకించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లాంటి సంస్థలచేత అనుకూల తీర్మానం చేయించడం మాములు విషయం కాదు. రాహుల్ ఉద్యమం కులగణన వ్యతిరేకులలో మార్పు తేగలిగింది. నేటి భారత రాజకీయాలలో, చర్చలలో సామాజిక న్యాయ నినాదాన్ని కేంద్ర బిందువు చేయడంలో మాత్రం రాహుల్ గాంధీ సాధించిన విజయంగా చెప్పవచ్చు. అంబేద్కర్, పెరియార్, కాన్షిరాం, లోహియా నడిచిన దారిలోనే రాహుల్ గాంధీ పయనిస్తున్నాడు.
- దొమ్మాట వెంకటేష్ ,ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
