- ఐదేండ్లలో రూ. 13,127 కోట్లు నష్టపోయిన సింగరేణి
- టన్ను బొగ్గు ఉత్పత్తి ఖర్చు రూ.11,198
- మార్కెట్లో రూ.4,410 చొప్పున విక్రయం
- యంత్రాల పనితీరు మెరుగుపడకపోవడమే ప్రధాన కారణం
కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థకు చెందిన భూగర్భగనులు నష్టాల బాటలో నడుస్తున్నాయి. వీటిలో బొగ్గు ఉత్పత్తి వ్యయానికి, అమ్మకపు రేటుకు మధ్య భారీ తేడా ఉంటోంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.11,198 ఖర్చవుతుండగా, మార్కెట్లో రూ.4,410 చొప్పున విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రతి టన్నుపై రూ.6,788 చొప్పున నష్టం వస్తోంది. గడిచిన ఐదేండ్లలో భూగర్భ గనులు రూ.13,127 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఇటీవల జరిగిన మల్టీ డిపార్ట్మెంట్ సమావేశాల్లో భూగర్భగనుల్లో వస్తున్న నష్టాల వివరాలను యాజమాన్యం ప్రకటించింది. ఈ క్రమంలో ఎక్కువ నష్టాలు వస్తున్న భూగర్భ గనులను మూసివేస్తున్న సంస్థ, ఉపరితల గనుల వైపు మొగ్గుచూపుతోంది. ఫలితంగా ఒకప్పుడు కోల్బెల్ట్ పరిధిలో 56గా ఉన్న భూగర్భగనుల సంఖ్య ప్రస్తుతం 21కి పరిమితమైంది. భూగర్భ గనుల్లో తట్టా, చెమ్మాస్ ఎప్పుడో మాయమయ్యాయి. ప్రస్తతం సింగరేణి వ్యాప్తంగా 16 గనుల్లో యంత్రాల ద్వారానే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కాగా, ఆయా యంత్రాలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది.
-మెరుగుపడని యంత్రాల పనితీరు
సింగరేణిలో యంత్రాల పనితీరు మెరుగుపడకపోవడంతో బొగ్గు ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఒక ఎస్డీఎల్(సైడ్ డంపర్ లోడర్) యంత్రం రోజుకు సాధారణంగా 130 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి. కానీ సగటున కేవలం 86 టన్నులతోనే సరిపెడుతోంది. ఎల్హెచ్డీ యంత్రం రోజుకు 250 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా... 117 టన్నులు మాత్రమే వెలికితీస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంటిన్యూస్ మైనర్ యంత్రాలు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. రోజుకు 800 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా 643 టన్నులకే పరిమితం అవుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. యంత్రాలను పూర్తి కెపాసిటీతో నడిపించడంపై ఎండీటీ సమావేశాల్లో ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం ప్రతిసారి అవగాహన కల్పిస్తోంది. అయితే పాతపడిన యంత్రాలు తరచూ బ్రేక్డౌన్లకు గురవుతున్నాయి. వాటిని స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకండా.. రిపేర్లతోనే సరిపెడుతుండడంతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు చేరడం లేదని కార్మికులు అంటున్నారు. ఓపెన్ కాస్ట్ గనులతో సమానంగా భూగర్భ గనులు పనిచేస్తే సంస్థకు భారీ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 2025-–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అండర్ గ్రౌండ్ మైన్ల నుంచి 72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 41.38 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. ఓసీపీల ద్వారా 538.66 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది.
సింగరేణి -బొగ్గు ధర ఎక్కువే..
మార్కెట్లో ఇతర సంస్థలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు తక్కువ ధరకు విక్రయిస్తే నష్టాలు మరిన్ని పెరిగి ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండంతో ఆ స్థాయిలోనే మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ టన్ను బొగ్గును రూ.8,519కి విక్రయిస్తే వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కంపెనీ రూ.5,031, కోలిండియా రూ.4,412 కే అమ్ముతున్నాయి. సింగరేణితో పోలిస్తే సగం ధరకే బొగ్గును అమ్ముతుండడంతో వినియోగదారుల ఆ సంస్థల వైపు చూస్తున్నారు.
అయిదేండ్లలో వచ్చిన నష్టాలు
సంవత్సరం నష్టం (కోట్లలో)
2021-22 3,145
2022-23 2,421
2023-24 2,812
2024-25 2,212
2025-26 2,537
