అన్నపురెడ్డిపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 88 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అన్నపురెడ్డిపల్లి శివారులోని వెంకటాపురం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి కేరళకు వెళ్తున్న ఓ కారును తనిఖీ చేశారు. కారులో రూ.44 లక్షల విలువైన 88 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ రిషాద్ చెరియండి, శ్రీరాజ్ కుంజవీటిల్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించి గంజాయిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్సై విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
