- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: రానున్న పదేండ్లలో ఖమ్మం నగరం వేగంగా విస్తరించనున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులు మెరుగుపర్చాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం రఘునాథపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద రూ.3.62 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరానికి అత్యవసరంగా 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం అవసరమని, ఇందుకు అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆఫీసర్లకు సూచించారు.
అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ఫోన్‌లో మాట్లాడిన తుమ్మల, వైద్య కళాశాల పనుల పూర్తి కోసం రూ.64 కోట్ల అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
డిసెంబర్ చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా కళాశాల ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని 17 బ్లాకులు, హాస్టళ్లు, అకడమిక్ బ్లాకులు, ఇతర నిర్మాణాలను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసి, కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, ఆర్డీవో శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై పరిశీలన..
అంతకుముందు ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ప్రయాణించి వాహనాల రాకపోకలను మంత్రి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ హైవే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక అనుసంధానంగా మారిందన్నారు. అమరావతి–నాగపూర్ హైవే పూర్తైతే ఖమ్మం నగరానికి సహజసిద్ధమైన రింగ్‌రోడ్డు ఏర్పడుతుందని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కొత్తగూడెం–హైదరాబాద్ జాతీయ రహదారి దోహదపడుతుందని చెప్పారు. గోదావరిలో నౌకాయానానికి కేంద్రం చొరవ చూపాలని కోరారు. కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పడితే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో జాతీయ రహదారుల నిర్మాణం ఎంతో సంతృప్తినిచ్చిన అంశమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి
ములకలపల్లి/ దమ్మపేట : భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మండల రైతులు కోరారు. సోమవారం గండుగులపల్లిలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, బాల అప్పారావు, సీపీఐ నాయకులు మరాటి ప్రసాద్ తదితరులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా, డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట మండల రెవెన్యూ ఆఫీసర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న మద్దినేని మురళి మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.
