- క్రాప్ లోన్ వడ్డీ క్లియర్ చేశాకే హోల్డ్ ఎత్తివేత
- విత్ డ్రా లో రోజుకి రూ. 20 వేలకు మించి నగదు ఇవ్వకుండా తిప్పలు
- పెట్టుబడులకు పైసలు అవసరమైన సమయంలో బ్యాంకర్ల ఆంక్షలతో రైతులకు ఇబ్బందులు
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురానికి చెందిన రైతు తమ్మారపు బ్రహ్మయ్య ఎండాకాలం ఎకరం భూమిలో మొక్క జొన్నలు సాగు చేశారు. 37 క్వింటాళ్ల దిగుబడి రాగా, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 26 క్వింటాళ్లు అమ్మారు. నాలుగు రోజుల క్రితం మక్కలు పైసలు రూ.70 వేలు బ్యాంకులో జమ అయ్యాయి.
వాటిని ప్రస్తుతం పంట పెట్టుబడి కోసం విత్ డ్రా చేసుకునేందుకు బోనకల్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కు వెళ్లగా, పాత క్రాప్ లోన్ వడ్డీ కింద హోల్డ్ లో పెట్టారు. బ్యాంక్ మేనేజర్ ను కలిస్తే, గతంలో ఉన్న క్రాప్ లోన్ వడ్డీ కింద రూ.35 వేలు కడితేనే మిగిలిన మొత్తం ఇస్తామని మెలిక పెట్టారు. దీంతో చేసేదేం లేక వడ్డీ మొత్తం చెల్లించి, మిగిలిన డబ్బులు డ్రా చేసుకున్నారు.
ఖమ్మం, వెలుగు:
వానా కాలం పంటల సీజన్ ప్రారంభంలోనే రైతులకు బ్యాంకర్లు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలో జమ అయిన పంట పైసలు తీసుకునేందుకు నానా తిప్పలు పెడుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో నగదు తీసుకునేందుకు పరిమితి విధిస్తుంటే, మరికొన్ని చోట్ల పాత అప్పుల కింద బలవంతంగా రైతుల పైసలు కట్ చేసుకుంటున్నారు. అప్పటి అప్పులకు వడ్డీ కడితేనే, మిగిలిన పైసలు తీసుకోవచ్చంటూ మెలిక పెడుతున్నారు.
మక్కల కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన తర్వాత కనీసం రెండు, మూడు వారాల తర్వాతే బ్యాంకు అకౌంట్లలో జమవుతున్నాయి. వాటిని తీసుకోనివ్వకుండా ఆఫీసర్లు తిప్పుకుంటున్నారు. కొన్ని బ్యాంకుల్లో రూ.20 వేలకు మించి రైతులకు నగదు ఇవ్వడం లేదు. మరికొన్ని చోట్ల రూ.30 వేలు తీసుకోవాలని, ఎక్కువ మొత్తం కావాలంటే ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. పంట సీజన్ ప్రారంభ దశలో పెట్టుబడులకు అవసరమైన పైసలను, అవి కూడా సొంత బ్యాంకు అకౌంట్లలో ఉన్న వాటిని తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లిన అన్నదాతలు... ఆఫీసర్లు పెడుతున్న ఈ తిప్పలను చూసి కోపానికొస్తున్నారు.
అందరికీ ఆన్ లైన్ లో సాధ్యమేనా..!
గ్రామాల్లో రైతులు పంట అమ్మిన పైసలు చేతికి వచ్చిన తర్వాతనే ఆ సీజన్ మొత్తానికి సంబంధించిన ట్రాక్టర్ కిరాయిలు, కూలీలకు చెల్లింపులు చేస్తుంటారు. ఒకవైపు తమకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం రైతుల ఇండ్ల చుట్టూ కూలీలు తిరుగుతున్నారు. పంట అమ్మిన డబ్బులు అకౌంట్లలో జమయ్యాయని, వాటిని తీసుకునేందుకు వెళ్లిన తమకు ఆఫీసర్లు క్యాష్ ఇవ్వకుండా ఇవాళ కొంత, రేపు కొంత అంటూ తిప్పుతున్నారని రైతులు చెబుతున్నారు.
అసలు స్మార్ట్ ఫోన్లే తెలియని తమకు ఆన్ లైన్ లో పేమెంట్స్ ఎలా చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. నగదు పరిమితి ఆంక్షలు లేకుండా, పాత వడ్డీల గురించి తమ అకౌంట్లు హోల్డ్ లో పెట్టకుండా, బ్యాంకర్లు తమకు సహకరించాలని అన్నదాతలు
కోరుతున్నారు.
నగదు ఇవ్వకుండా ఆన్ లైన్ చేసుకోమంటున్నారు
నాకు కొణిజర్ల ఎస్బీఐ లో అకౌంట్ ఉంది. మొక్కజొన్న పంట అమ్మిన డబ్బులు ఇటీవల నా ఖాతాలో జమ అయ్యాయి. బ్యాంకు వాళ్ళు నగదు ఇవ్వడం లేదు. ఆన్లైన్ చేసుకోమని సూచిస్తున్నారు. సొంత డబ్బు ఖాతాల్లో ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -భూక్యా చంద్రశేఖర్, మేకలకుంట, కొణిజర్ల మండలం
పంట డబ్బులన్నీ రైతులకు చెల్లించాలి:
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. పంట డబ్బులు బ్యాంకులు పాత అప్పు కింద జమ చేయకుండా ఆదేశాలివ్వాలి. వానా కాలం సీజన్ కు దుక్కులు దున్నుకుంటూ, పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతుల డబ్బులు పాత అప్పులకు జమ చేయడం దారుణం. -రాంబాబు, తెలంగాణ రైతు సంఘం
ఖమ్మం జిల్లా కార్యదర్శి
