- 403 మందిపై 192 కేసులు పెట్టినం
- వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నియంత్రణలో డ్రగ్స్ కంట్రోల్ టీం మంచి ఫలితాలు సాధించిందని సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024 జూలై 15న ఏర్పాటు చేసిన ఈ బృందం ఇప్పటివరకు 192 కేసులు నమోదు చేసి 403 మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల్లో 1,241 కిలోల 110 గ్రాముల గంజాయి, 1.530 కిలోల ఓపియం, 22.4 లీటర్ల హషీష్ ఆయిల్, 251 గంజాయి చాక్లెట్లు, బ్రౌన్ షుగర్ ఉన్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.8.57 కోట్లుగా అంచనా వేశారు. రూ.2.15 లక్షల నగదు, 601 మొబైల్ ఫోన్లు, 63 బైకులు, 6 ఆటోలు, 8 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ధూమపానం ద్వారా మాదకద్రవ్యాలకు బానిసైన 435 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. రైల్వే, బస్ స్టేషన్లు, విద్యా సంస్థల పరిధిలో తనఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
పాఠశాలలకు 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లోని నిర్వహించే పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయించకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ నిర్మూలనకు 8712685299, 8712584473 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం అందించాలని సీపీ కోరారు.
