- డిజిటల్ ఒప్పంద పత్రాలపై ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు
- ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు అనంతరం సైన్ చేసిన ట్రంప్
- 60 రోజుల కాలపరిమితి.. 14 అంశాలతో ఒప్పందం ఖరారు
- పీస్ డీల్‌తో తెరుచుకోనున్న హార్మూజ్ జలసంధి
- సంతకాలు పూర్తయ్యాయ్: ట్రంప్
- ఒప్పందాన్ని బలహీనపర్చే చర్యలొద్దు: ఇరాన్
పారిస్: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన పీస్ డీల్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ డిజిటల్ సంతకాలు చేశారు. ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ చరిత్రాత్మక వెర్సాలిస్ ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులోనే అమెరికా, -ఇరాన్ ఒప్పంద పత్రంపై ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. ఆ సమయంలో అతని పక్కన మాక్రాన్ కూడా ఉన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షల సడలింపు, ఇరాన్ నుంచి చమురు ఎగుమతుల పునఃప్రారంభం, ఒప్పందంపై చర్చల కోసం 60 రోజుల కాలపరిమితి తదితర 14 అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
ఈ ఒప్పందానికి ‘ఇస్లామాబాద్ ఎంఓయూ బిట్వీన్ ద యూఎస్ఏ అండ్ ద ఇస్లామిక్రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ అని పేరు పెట్టారు. ఈ అవగాహన పత్రంపై ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ సంతకాలు చేశారు. బుధవారం ఇరు దేశాల అధ్యక్షులు డిజిటల్‌గా సంతకాలు చేశారు. దీంతో ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ పరిణామంతో నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు దిశగా ఒక ప్రధాన దౌత్యపరమైన ముందడుగు పడినట్టయింది. వాస్తవానికి ఈ ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం సంతకాలు జరగాల్సి ఉంది. కానీ, దానికి ముందుగానే సంతకాల కార్యక్రమం పూర్తయింది. అయితే, జెనీవాలో రెండు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు.
సంతకాలు పూర్తయ్యాయ్: ట్రంప్
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించిన ఒప్పందంపై సంతకం పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విందు అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ప్యాలెస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తాను వెర్సాలిస్‌లో ఇరాన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్టు వెల్లడించారు. కాగా, సంతకాల కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను వైట్‌హౌస్ విడుదల చేసింది. ఈ ఒప్పందాన్ని అధికారికంగా అమలులోకి తీసుకురావడానికి, సంతకం చేసిన ఒప్పందం ఫొటోను ఇరాన్‌తో పాటు మధ్యవర్తిత్వ దేశాలకు కూడా పంపినట్టు తెలిపింది.
ఒప్పందాన్ని బలహీనపర్చొద్దు: ఇరాన్
ఈ అవగాహన ఒప్పందం 60 రోజుల కాలపరిమితిని నిర్దేశిస్తుందని.. ఈ కాలంలో ఏ పక్షమూ ఒప్పందాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకోకూడదని ఇరాన్ తెలిపింది. ఈ కాలంలో అమెరికా కొత్త ఆంక్షలు విధించడం గానీ, ఆ ప్రాంతంలో సైనిక మోహరింపును పెంచడం గానీ చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ అన్నారు. ఒప్పందంపై తాము కూడా సంతకాలు చేశామని.. అయితే, ఇప్పుడు దాని అమలును పరీక్షించాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చమురు సంబంధిత ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలని, తద్వారా ఇరాన్ 60 రోజుల వీలు కల్పించాలని, ఈ సమయంలో ఇరుపక్షాలు ఒప్పందం తుది నిబంధనలపై చర్చలు జరుపుతాయని బఘేయీ పేర్కొన్నారు. కాగా, అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ అని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. మధ్యవర్తిగా పాకిస్తాన్ దీనిని ఆమోదించిందని ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు.
ఇరాన్ పోర్టుల బ్లాకేడ్‌ను ఎత్తివేశాం: జేడీ వాన్స్
యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో భాగంగా అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టులకు డజనుకు పైగా నౌకలను అనుమతించిందని, అక్కడ విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేసిందని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గురువారం తెలిపారు. వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్‌లో వాన్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా మరింత ఎక్కువ మొత్తంలో చమురు రవాణా అవుతోందని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ఈ షిప్పింగ్ ఛానల్ ద్వారా 12.5 మిలియన్ బారెల్స్ కంటే ఎక్కువ చమురు సరఫరా అయిందని పేర్కొన్నారు. ‘‘ఒప్పందంలోని ప్రారంభ సైనిక నిబంధనలకు సంబంధించి మా వైపు నుంచి మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం’’ అని వాన్స్ అన్నారు. ఈ ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉందంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ, ఇది ఒప్పందం వల్ల చేకూరిన తక్షణ ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆయన ఇజ్రాయెల్‌లోని అమెరికా విమర్శకులను హెచ్చరిస్తూ అసాధారణ రీతిలో మండిపడ్డారు. ఇజ్రాయెల్‌కు మిగిలి ఉన్న ‘‘ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపైనే దాడులు చేయవద్దు’’ అని తీవ్రంగా హెచ్చరించారు
