- పవన్ కల్యాణ్ తెలంగాణపై మాట్లాడితే నోరెత్తుతలేరు
- తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటు వాదులన్నా పవన్‌పై దేశద్రోహ కేసు పెట్టాలని డిమాండ్
సిరిసిల్ల/ కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేసుడు బంద్ చేశాడని, వీకెండ్ ఎమ్మెల్యేగా మారారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తెలంగాణ గురించి మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు నోరు తెరవడం లేదని మండిపడ్డారు. గురువారం సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా ఆర్జీ2 పరిధిలోని ఓపెన్ కాస్ట్3 ప్రాజెక్టును కవిత సందర్శించారు.
ఆ తర్వాత కరీంనగర్ చేరుకుని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాత్రి సిరిసిల్లలో టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ, సిరిసిల్లలో సెస్‌ను తీసేస్తే కేటీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేతన్నలకు షెడ్లు కట్టించి వదిలేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంపుకుందని, అందుకే తెలంగాణ ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్ వచ్చిందన్నారు.
సిరిసిల్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పారు. నేరేళ్ల బాధితులను కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పరామర్శించారని, కానీ ఎవరూ వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. నేరేళ్ల బాధితులకు తాను న్యాయం చేసి చూపిస్తానన్నారు.
బీజేపీ వస్తే ఊరి దేవతలను మాయం చేస్తరు..
తెలంగాణ ప్రజలను టెర్రరిస్టులు, వేర్పాటువాదులతో పోల్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజల కోసం పోరాటం చేసే తమపై కేసులు పెడ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టేందుకు చేతకావడం లేదా అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మన ఊరి పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ దేవుళ్లను మాయం చేస్తారని హెచ్చరించారు. సినిమా స్టార్లను ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్స్‌గానే చూడాలని తప్ప.. పొలిటికల్ ఫ్యాక్టర్స్‌గా చూడొద్దని సూచించారు.
ఇన్నాళ్లు మగ నాయకుల పాలన చూశారని, ఆడ బిడ్డగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. సింగరేణిలో ఇప్పటికీ కూడా బ్రిటీష్ పాలన నడుస్తోందని, ఆఫీసర్‌ను ప్రశ్నిస్తే ఆ కార్మికుడికి చార్జ్‌షీట్ ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని కవిత ఆరోపించారు. తాను టీజీబీకేఎస్‌లో ఉన్నప్పుడే ప్లే డే, ఎన్ మైనస్ పద్ధతి, హీహెచ్‌డీలో 50 శాతం ఇచ్చే విధానం వచ్చిందని, దీని కారణంగా కార్మికులు రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోతున్నారని చెప్పారు. కార్మికులకు ఇంత నష్టం జరుగుతుందని అప్పుడు తమకు తెలియదని, తమ వల్ల జరిగిన తప్పునకు క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు.
పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు కవిత పరామర్శ
సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఇటీవల పానీపూరి తిని అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కవిత పరామర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో కల్తీ ఆహారం విక్రయాలు జరుగుతున్నా.. ప్రభుత్వం కేసులు బుక్ చేయడం లేదని మండిపడ్డారు.
