స్కూల్ యూనిఫాంల కుట్టుపనిలో మహిళా శక్తి..ప్రతి రోజూ లక్షకుపైగా జతలు

స్కూల్ యూనిఫాంల కుట్టుపనిలో మహిళా శక్తి..ప్రతి రోజూ లక్షకుపైగా జతలు
  • ప్రతి రోజూ లక్షకుపైగా జతలు
  • నాణ్యత పరిశీలనకు మేకర్ అండ్ చెకర్ విధానం
  • నేడు సీఎం చేతుల మీదుగా ‘విద్యా కానుక’ ప్రారంభం
  • మహిళా సాధికారతకు నిదర్శనం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన యూనిఫాంలు అందించేందుకు మహిళా సంఘాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది మహిళా సంఘాల సభ్యులు యూనిఫాంలు కుడుతున్నారు. వీరిలో 15 వేల మందికి ఆధునిక కుట్టు యంత్రాల వినియోగం, ప్రమాణాల ప్రకారం బట్టలు కుట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. సరైన ఫిట్టింగ్‌‌‌‌ కోసం విద్యార్థుల నుంచి వ్యక్తిగతంగా సేకరించిన కొలతల ఆధారంగా యూనిఫాంలను కుడుతున్నారు.

‘విద్యా కానుక’ కార్యక్రమంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు మహిళా సంఘాలు ఇప్పటికే ప్రత్యేకంగా 5 వేల స్టూడెంట్ కిట్లను సిద్ధం చేశాయి. వీటిని శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లలో యూనిఫాంలు, ఇతర విద్యా సామగ్రిని ప్యాక్ చేయడం నుంచి పంపిణీ ఏర్పాట్ల వరకు ప్రతిదీ సెర్ప్‌‌‌‌ మహిళలే నిర్వహిస్తున్నారు. 

నాణ్యత కోసం మేక‌‌‌‌ర్ అండ్ చెక‌‌‌‌ర్

యూనిఫాంల నాణ్యతను పెంచేందుకు సెర్ప్‌‌‌‌వినూత్నంగా ‘మేకర్ అండ్ చెకర్’ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతి ప్రకారం ప్రతి కుట్టు కేంద్రాన్ని నిపుణులు పర్యవేక్షిస్తారు. ఒక బృందం దుస్తులను కుడితే, మరొక బృందం వాటి నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. లోపాలు గుర్తిస్తే వెంటనే టైలర్ల ద్వారా వాటిని సరిచేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రోజూ లక్షకు పైగా యూనిఫాంలను కుడుతూ, వాటిని ఎప్పటికప్పుడు పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు.

ఆర్థిక స్వావలంబనకు వారధి: మంత్రి సీతక్క

మహిళా సంఘాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క కొనియాడారు. కేవలం రుణాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శ్రమిస్తున్న మహిళల అంకితభావం అభినందనీయమన్నారు. ఒకవైపు మహిళలకు ఆదాయం ఇస్తూనే.. మరోవైపు ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్న ఈ కార్యక్రమం మహిళా సాధికారతకు నిజమైన నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.