ప్రపంచానికి భారత్  నమ్మకమైన భాగస్వామి : ప్రధాని మోదీ

ప్రపంచానికి భారత్  నమ్మకమైన భాగస్వామి : ప్రధాని మోదీ
  •     ఫ్రాన్స్‌‌ లో ప్రవాస భారతీయుల సభలో ప్రధాని మోదీ 
  •     వచ్చే ఏడాది భారత్, ఫ్రాన్స్ కలిసి తృష్ణా శాటిలైట్ ప్రయోగించనున్నట్లు వెల్లడి
  •     టెక్నాలజీ అందరికీ చేరితేనే.. నిజమైన అభివృద్ధి
  •     పారిస్‌‌లో ‘వివాటెక్-2026’ సదస్సులో మోదీ స్పీచ్ 

పారిస్: ప్రపంచ దేశాలకు భారతదేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే తరాలకు వృద్ధిని, ఆవిష్కరణలను, అవకాశాలను అందించే రంగాల్లోనే ఇండియా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.  గురువారం ఆయన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో ఉన్న సాల్ ప్లేయెల్ ఇండోర్ వేదికలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కేవలం వ్యాపారాల ఆధారంగానే గతంలో దేశాల మధ్య సంబంధాలు ఉండేవని, కానీ ప్రస్తుతం వ్యాపారంతో పాటు పరస్పర నమ్మకం కూడా అంతే ముఖ్యంగా మారిందని తెలిపారు. భారత్, ఫ్రాన్స్ దేశాలు కలిసి వచ్చే ఏడాది 'తృష్ణా' అనే శాటిలైట్ ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడిని నివారించడానికి, ఆహార భద్రతను పర్యవేక్షించడానికి ఎంతో సహాయపడుతుందని వివరించారు. ప్రపంచంలో ప్రస్తుతం సవాళ్లు, అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య బంధం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంలా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. గత 12 ఏండ్లుగా  ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం తన జీవితంలో దక్కిన గొప్ప భాగ్యమని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రవాస భారతీయులు "బోంజూర్ మోదీ(నమస్కారం మోదీ)", "భారత్ మాతా కీ జై" నినాదాలతో ప్రధానికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.

భారత్, అమెరికా ట్రేడ్​ అగ్రిమెంట్​ స్పీడప్.. 

ఫ్రాన్స్‌‌లోని ఎవియాన్ లీ బాలో జీ7 సదస్సు సందర్భంగా బుధవారం భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. ఇరు దేశాలకు బ్యాలెన్స్‌‌డ్‌‌గా, పరస్పర ప్రయోజనకరంగా, వాణిజ్యపరంగా ఉపయోగకరంగా ఉండే ఒప్పందాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ట్రేడ్ డీల్‌‌పై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని, మధ్యంతర ఒప్పందం దిశగా మంచి పురోగతి సాధించినట్లు ఇద్దరు నేతలు పేర్కొన్నారు. ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ వచ్చే వారం భారత్‌‌కు రానున్నారు. అలాగే భారత్, -అమెరికా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని మోదీ, ట్రంప్ పునరుద్ఘాటించారు. వాషింగ్టన్‌‌లో 2025 ఫిబ్రవరిలో జరిగిన సమావేశం తర్వాత ఇండియా, -యూఎస్ కాంపాక్ట్ (కాంపాక్ట్) కింద సాధించిన పురోగతిని ఇరు నేతలు సమీక్షించారు. 
ఏఐ అంటే.. ‘ఆల్ ఇన్‌‌క్లూజివ్’ కూడా.. 
టెక్నాలజీ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే అది నిజమైన అభివృద్ధికి దారితీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌‌కు ఏఐ అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా ‘‘ఆల్ ఇన్‌‌క్లూజివ్’’ కూడా అని పేర్కొన్నారు. పారిస్‌‌లో గురువారం జరిగిన ‘వివాటెక్-2026’ సదస్సులో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌‌తో కలిసి మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లలో టెక్నాలజీ ఆధారంగా భారత్ వేగంగా మారిందని, ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల వేదికలను నిర్మించామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగం భారత్‌‌లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. యూరప్‌‌లో అతిపెద్ద టెక్నాలజీ, ఇన్నోవేషన్ కార్యక్రమమైన ‘వివాటెక్’లో ఈ ఏడాది భారత్‌‌కు అతిపెద్ద జాతీయ పెవిలియన్ ఏర్పాటు కావడం విశేషం.

ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ 

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌‌లో ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. భారత్‌‌లో పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార విస్తరణ, కొత్త భాగస్వామ్యాలపై చర్చించారు. షిప్పింగ్‌‌, లాజిస్టిక్స్‌‌, రైల్వేలు, కన్​స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇటీవల జీ7 సదస్సులో పాల్గొన్న మోదీ, అక్కడి నుంచి పారిస్‌‌కు చేరుకుని ఈ సమావేశాలు నిర్వహించారు.