-
దిగుమతులను తగ్గించడమే టార్గెట్
న్యూఢిల్లీ: బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడకుండా మనదేశంలోనే తయారీని పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం నడుం బిగించింది. బ్యాటరీ భాగాల తయారీకి కొత్త ప్రోత్సాహక పథకాన్ని సిద్ధం చేస్తోంది. క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (క్యామ్), ఆనోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (ఏమ్), ఎలక్ట్రోలైజర్స్, కాపర్ ఫాయిల్ సెపరేటర్స్ తయారీకి ఆర్థిక సాయం ఇవ్వనుంది.
ఈ పథకం ద్వారా సుమారు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశం బ్యాటరీ తయారీకి అవసరమైన కీలక విడి భాగాల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ పథకానికి ఆమోదం తుదిదశలో ఉంది. కంపెనీలు బ్యాటరీల తయారీకి విదేశాల నుంచి తుది ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం, చివరి దశ పనులను పూర్తి చేసి ప్రోత్సాహకాలు పొందడం కుదరదు. దేశీయంగానే తయారీని పెంచాలి. సరఫరా వ్యవస్థను నిర్మించాలి. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, అంతరిక్ష రంగాలలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. భారీ పరిశ్రమల శాఖ ఇప్పటికే అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ తయారీ కోసం రూ.18 వేల కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా దేశంలో 50 గిగావాట్ అవర్ సామర్థ్యాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉత్పత్తికి ఊతం
కొత్తగా తీసుకువస్తున్న ఈ పథకం ప్రస్తుత బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. పరిశ్రమల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో దేశీయ బ్యాటరీ తయారీ సామర్థ్యం 223 గిగావాట్ అవర్ స్థాయికి చేరుకుంటుంది. దీనిని అందుకోవడానికి రెండు లక్షల టన్నుల ఆనోడ్ యాక్టివ్ మెటీరియల్స్ , నాలుగు లక్షల టన్నుల క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ అవసరమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాటరీ తయారీలో కాపర్ ఫాయిల్ డిమాండ్ పెరుగుతోంది.
ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ప్రపంచంలోని కాపర్ ఫాయిల్ సరఫరాలో 80 శాతం వాటా చైనా సంస్థల వద్ద ఉంది. మిగిలిన 20 శాతం కొరియా కంపెనీల దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ తయారీకి మద్దతు ఇవ్వాలని పరిశ్రమలు కోరుతున్నాయి. పన్ను రాయితీలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లిథియం- అయాన్ సెల్స్ తయారీకి వాడే యంత్రాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించినట్టు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.
