- తండ్రి మృతి, తల్లి జైలుకు.. అనాథలైన ఇద్దరు పిల్లలు
- మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో ఘటన
గూడూరు, వెలుగు: తాగొచ్చి గొడవ పడిన భర్తను భార్య ఇసుర్రాయితో కొట్టి చంపింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లా తండాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన బోడ లాలు (40) తన భార్య విజయ, పిల్లలతో కలిసి మూడేండ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో మరో మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విజయ ఆరు నెలల కింద తన ఇద్దరు పిల్లలతో సోమ్లా తండాకు వచ్చి అత్తగారింట్లో ఉంటోంది.
భార్యాభర్తల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్దల సమక్షంలో రెండు మూడు సార్లు పంచాయితీ పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో లాలు, విజయ విడివిడిగానే ఉంటున్నారు. బుధవారం చర్లతండాలో బంధువుల పెండ్లికి హాజరైన లాలు అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో సోమ్లా తండాలోని ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో విజయ పక్కనే ఉన్న ఇసుర్రాయితో లాలు తలపై బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన లాలు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి బోడ సోమ్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విజయను అరెస్ట్ చేశారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు కెళ్లడంతో ఆరేండ్ల కొడుకు, ఐదేండ్ల కూతురు అనాథలయ్యారు.
