- ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే భూములను తాకట్టు పెట్టుకోవడమేంటి?
- ఎస్‌బీఐ ఆఫీసర్లపై హైకోర్టు ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకున్నారా? లేదా?
- లేదంటే సుమోటోగా తీసుకొని సీబీఐ ఎంక్వైరీకి ఆదేశిస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే భూములను తాకట్టు పెట్టుకొని గుడ్డిగా వందల కోట్ల లోన్లు ఎలా మంజూరు చేస్తారని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హైకోర్టు నిలదీసింది. కేవలం రూ.200 కోట్ల ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లకు పైగా రుణం ఎలా ఇస్తారని నిలదీసింది. రుణ మంజూరులో బాధ్యతారాహిత్యం, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులైన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని ఆదేశించింది.
ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కోర్టే స్వయంగా సుమోటోగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్‌సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) పరిధిలో సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బెంగళూరు ఎస్‌బీఐ శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ నగేశ్ భీమపాక గురువారం విచారించి ఎస్‌బీఐ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దశలో ఎస్‌బీఐకి ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పారు. ప్రతివాదులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, శంషాబాద్ జోనల్ మేనేజర్, సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేశారు.
విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫ్యాబ్‌సిటీ పరిధిలోని పలు సర్వే నంబర్లలో ఉన్న భూములను సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కేటాయించిందని, అనంతరం కేటాయింపు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో 2023లో జీవో నం.9 ద్వారా ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభించిందని వివరించారు.
అయితే, కంపెనీ తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంకు ఇప్పటికే రికవరీ ప్రక్రియ ప్రారంభించిందని, 2012లోనే స్వాధీన నోటీసులు జారీ చేసినట్లు కోర్టు దష్టికి తీసుకొచ్చారు. రుణ వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని వాదించారు.
కోర్టు స్టే ఉన్న భూములకు లోన్ ఇవ్వడమేంటి?
ఈ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి పలు కీలక ప్రశ్నలు సంధించారు. రూ.200 కోట్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్ల రుణం ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా బ్యాంకు తరఫు న్యాయవాది అసలు రుణం అంతకంటే తక్కువేనని, వడ్డీలు, ఇతర బకాయిలు కలిపి మొత్తం పెరిగిందని వివరణ ఇచ్చారు. అయితే ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే మొత్తం బకాయి రూ.624 కోట్లకు చేరిందని కోర్టు గుర్తుచేసింది. ఇంకా, ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ఉన్న భూములను, అలాగే గతంలో కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న భూములను తాకట్టు పెట్టుకొని రుణాలు ఎలా మంజూరు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
అలాంటి రుణ మంజూరుకు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేశారా లేదా అని ప్రశ్నించింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో తెలియజేయాలని సూచించింది. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు చేశారా లేదా అనే విషయాన్ని కూడా వివరించాలని కోరింది. బ్యాంకుల్లోని నిధులు ప్రజల సొమ్మని, ప్రజలు నమ్మకంతో జమ చేసిన డబ్బును నిర్లక్ష్యంగా రుణాల రూపంలో విడుదల చేయడం ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది. పరిశ్రమలు స్థాపిస్తామని ప్రభుత్వ భూములు పొందడం, ఆ తరువాత అదే భూములను తాకట్టు పెట్టి భారీ రుణాలు పొందడం, బ్యాంకులు కూడా సరైన పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయపడింది.
ఇలాంటి రుణాలు తీసుకున్న కొందరు విదేశాలకు వెళ్లిపోతుండగా, నష్టపోతున్నది మాత్రం బ్యాంకులను నమ్మిన సామాన్య ప్రజలేనని పేర్కొంది. ఉపాధి కల్పన పేరుతో భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కొన్ని సంస్థలు కనుమరుగవుతున్నాయని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూకేటాయింపు విధానం ఉద్దేశాలను కంపెనీలు మాత్రమే కాకుండా ఆర్థిక సంస్థలు కూడా నిర్వీర్యం చేస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రుణాల మంజూరులో బ్యాంకు అధికారులు అసాధారణ ఉదారత ప్రదర్శించారని కూడా వ్యాఖ్యానించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
