11 ఏళ్ల తర్వాత.. అప్పుడు ఇప్పుడు కెప్టెన్లే

11 ఏళ్ల తర్వాత.. అప్పుడు ఇప్పుడు కెప్టెన్లే

వరల్డ్‌‌కప్‌‌లో పాకిస్థాన్‌‌ సెమీస్‌‌ చేరకపోయినా.. ఆ టీమ్‌‌ గురించిన ఓ చర్చ బాగా ఆసక్తి రేపింది. 1992 వరల్డ్‌‌కప్‌‌ తరహాలో ఫలితాలు రావడంతో దాయాది జట్టు కప్‌‌ గెలుస్తుందని కొంత మంది అభిమానులు, విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పాక్‌‌ సెమీస్‌‌కు రాకపోవడంతో ఆ చర్చకు ఫుల్‌‌స్టాప్‌‌ పడినా.. ఇప్పుడు టీమిండియా విషయంలో మరో ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది.   శ్రీలంకపై చివరి లీగ్‌‌లో గెలిచిన ఇండియా పాయింట్ల పట్టికలో టాప్‌‌ ప్లేస్‌‌కు చేరగా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా సెకండ్‌‌ ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. దీంతో టీమిండియా, కివీస్‌‌ మధ్య తొలి సెమీస్‌‌ జరుగనుంది. ఇదే ఇప్పుడు హాట్‌‌ టాపిక్‌‌గా మారింది. ఎందుకంటే 11 ఏళ్ల కిందట 2008 మలేసియాలో జరిగిన అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌లోనూ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇంకో ఆసక్తికర అంశమేమిటంటే అప్పుడు జూనియర్‌‌  సారథులుగా ఉన్న కోహ్లీ, విలియమ్సన్‌‌.. ఇప్పుడు సీనియర్‌‌ జట్ల కెప్టెన్లుగా మరో బిగ్‌‌ఫైట్‌‌కు రెడీ అవుతున్నారు.  అప్పటి జట్టులో విరాట్‌‌తోపాటు ఉన్న జడేజా ప్రస్తుత టీమ్‌‌లో ఉండగా, విలియమ్సన్‌‌తో పాటు అప్పుడు ఆడిన ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, టిమ్‌‌ సౌథీ కూడా ప్రస్తుత కివీస్‌‌ టీమ్‌‌లో ఉన్నారు. ఆ మ్యాచ్‌‌లో విరాట్‌‌ బౌలింగ్‌‌లో కేన్‌‌ స్టంపౌట్‌‌ అవ్వగా, కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌‌ను విలియమ్సన్‌‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో 3 వికెట్ల తేడాతో గెలిచిన కోహ్లీసేన ఫైనల్‌‌ చేరి అక్కడ సౌతాఫ్రికాను చిత్తు చేసి చాంపియన్‌‌గా నిలిచింది. దీంతో మంగళవారం జరిగే తొలి సెమీస్‌‌లోనూ అదే సీన్‌‌ రిపీట్‌‌ అవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.  అయితే ఈ​ మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నా రిజర్వ్​ డే ఉండటం కాస్త ఉపశమనం. బుధవారం కూడా వర్షం వల్ల మ్యాచ్​ రద్దైతే టేబుల్​ టాపర్​గా ఇండియా ఫైనల్​కు చేరుకుంటుంది.