- నిర్మాణాలకు డీపీఆర్ రెడీ చేయాలని హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ ఆదేశం
- ఖైరతాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం స్థలాల పరిశీలన
హైదరాబాద్ సిటీ ,వెలుగు: క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఐజీ (లో ఇన్కం గ్రూప్) హౌసింగ్ స్కీమ్‌ను వేగంగా అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర సర్కార్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ గురువారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.
ముఖ్యంగా క్యూర్ ఏరియా పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద 12 వేల ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చినందున, ఆయా స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టాలన్న దానిపై సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను వీపీ గౌతమ్ ఆదేశించారు. పద్మాలయా స్టూడియోస్ సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో పెండింగ్‌లో ఉన్న టూబీహెచ్‌కే నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ప్రశాసన్ నగర్, బీఎన్ఆర్ నగర్, జర్నలిస్టు కాలనీ, ఎంఆర్‌సి కాలనీ, హకీంబాబా దర్గా, జహీరానగర్, గురుబ్రహ్మనగర్, దుర్గాభవాని నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ భూములను మూడు గంటల పాటు ఆయన స్వయంగా వెళ్లి పరిశీలించారు. స్లమ్ రీ డెవలప్‌మెంట్, ఎల్ఐజీ నిర్మాణాల్లో భాగంగా సుమారు 15 ప్రభుత్వ భూములను ఏయే పథకాలకు ఎలా వినియోగించాలన్న దానిపై పూర్తి వివరాలతో కూడిన సమగ్రమైన డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించి వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
