- 21 మందికి తీవ్ర గాయాలు
- మరో 21 మందికి గాయాలు
- చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
రాయ్పూర్: చత్తీస్‌గఢ్‌లోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని బాయిలర్ ట్యూబ్ పేలడంతో 13 మంది కార్మికులు స్పాట్లోనే మరణించగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్లాంట్‌లో కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో బాయిలర్ ట్యూబ్ ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ప్లాంట్ లోపల దట్టమైన పొగ కమ్మేయడంతో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులు రాయ్‌ఘర్‌లోని హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువమంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హర్దా, దేవాస్ జిల్లాలకు చెందిన వలస కూలీలని తెలిసింది. శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సమాచారం అందిన వెంటనే ఎస్పీ ప్రఫుల్ఠాకూర్సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం విష్ణుదేవ్సాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ చత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ ఈ సంఘటనపై మండిపడ్డారు. ఇది ప్రమాదం కాదు, మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య అని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

