హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 13 చోట్ల ఎయిర్‌పోర్టు స్థాయిలో సకల సదుపాయాలు ఉండేలా హై టెక్ బస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఆర్టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఆర్టీసీ బస్ స్టేషన్లు కేవలం ప్రయాణానికి మాత్రమే పరిమితం కాకుండా.. వినోదం, వ్యాపారాలకు సైతం కేంద్ర బిందువులుగా నిలవనున్నాయని పేర్కొంది.
ఈ బస్ స్టేషన్లకు రైల్వే, మెట్రో వంటి ఇతర రవాణా వ్యవస్థలను కూడా అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో నిర్మిస్తున్న హైటెక్ బస్ స్టేషన్ల జాబితాలో నాగర్ కర్నూల్, రేగొండ, హుజుర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ఉన్నాయి.
