- జగిత్యాల నుంచి కనిగిరికి వెళ్తుండగా మార్కాపురం వద్ద ఘోర ప్రమాదం
- వేగంగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డ 28 మంది
- సంతాపం తెలిపిన సీఎంలు రేవంత్, చంద్రబాబు
- ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ప్రమాదం వల్ల పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో 14 మంది సజీవ దహనమయ్యారు. 28 మంది తీవ్రంగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, కామారెడ్డికి వచ్చి తిరిగి వెళ్తున్న తండ్రీకొడుకులు, నిర్మల్‌జిల్లా లక్ష్మణచాందకు చెందిన ఒక మహిళ చనిపోయారు. ప్రమాద స్థలాన్ని ఏపీ హోంమంత్రి అనిత పరిశీలించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
క్షణాల్లో అంటుకున్న మంటలు
జగిత్యాలకు చెందిన హరికృష్ణ ట్రావెల్స్ (ఏఆర్20డి0487) బస్సు బుధవారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి బయలుదేరింది. మొత్తం 41 మంది ఉన్న బస్సు సాంకేతిక సమస్యలతో ఒంగోలు దగ్గర కొద్దిసేపు ఆగింది. రిపేర్ల తర్వాత మళ్లీ బయలుదేరిన బస్సు గురువారం తెల్లవారుజామున 6 గంటలకు మార్కాపురం జిల్లా రాయవరం పలకల క్వారీ సమీపంలోకి చేరుకోగా.. చీమకుర్తి నుంచి కంకర లోడ్‌తో వచ్చిన టిప్పర్‌ను ఢీ కొట్టింది. భారీగా ధ్వంసమైన వాహనాల్లోనుంచి ఆయిల్ ట్యాంకులు లీకై మంటలు చెలరేగాయి. టిప్పర్ క్యాబిన్‌కు, బస్సుకు మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల్లో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రయాణికులంతా నిద్రలో ఉండడం, యాక్సిడెంట్జరిగిన క్షణాల్లో మంటలుచుట్టుముట్టడంతో బస్సులో వెనుక వైపు ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ముందు కూర్చున్నవారు తృటిలో తప్పించుకున్నారు. కొంతమంది అద్దాలు పగులగొట్టి బయటకు దూకేశారు. 28 మంది గాయాలతో బయటపడ్డారు. ముందు సీట్లలో కూర్చున్న జగిత్యాల నుంచి వెళ్లిన ప్రయాణికులు, డ్రైవర్, హెల్పర్ ప్రాణాలు దక్కించుకున్నారు. వెనుక సీట్లలో ఉన్న కనిగిరి, వింజమూరు, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన 14 మంది బస్సులోనే సజీవదహనమయ్యారు. మృతదేహాలకు పరీక్షలలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాల వలస కూలీలు మృతి
జగిత్యాల/రాయికల్: ప్రమాదంలో జగిత్యాలకు వలస వచ్చిన ఇద్దరు కూలీలు చనిపోయారు. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ఉప్పు రమ, ముత్తంగి వెంకటేశ్వర్లు, మరికొందరు రాయికల్ మండలం రామరావుపల్లిలో నివాసముంటూ భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. వారంతా కలిసి స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో రమ, వెంకటేశ్వర్లు ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్ల చిన్నారి చైత్ర, ఉప్పు కిరణ్, తుపాకుల రత్నమ్మకు గాయాలయ్యాయి.
భార్యను కాపాడి భర్త మృతి..
కామారెడ్డి: కనిగిరి ప్రాంతంలోని పెదవారిగట్లకు చెందిన అనిల్(26) హైదరాబాద్‌లో ఓ కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తన భార్య సౌద, 5 నెలల కొడుకు లియోను తీసుకొని 3 రోజుల క్రితం కామారెడ్డిలో తన మేనమామ మహేశ్ఇంటికి వచ్చాడు. లియోకు అన్నప్రాసన చేయించేందుకు స్వగ్రామమైన పెద్దవారిగట్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భార్య సౌదను అనిల్బస్సు కిటీకీలో నుంచి బయటకు నెట్టడంతో ఆమె గాయాలతో బయటపడింది. ప్రమాదంతో బస్సులో కిందపడ్డ కొడుకును ఎత్తుకొని కిందకు దూకుతానని అనిల్చెప్పాడని, ఆలోపే మంటలు వ్యాపించడంతో సజీవదహనమయ్యారని సౌద బోరుమంది. తండ్రీకొడుకుల మరణించడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జీవనోపాధి కోసం వచ్చి..
లక్ష్మణచాంద: ఏపీలోని ప్రకాశం జిల్లా ఆర్జేలుపాడు మండలం అంక గోపాలపురానికి చెందిన పద్మ, వెంకటరావు దంపతులు 3 నెలల క్రితం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాందకు వలస వచ్చారు. స్వగ్రామానికి వెళ్లేందుకు బుధవారం పద్మ తన బంధువులు మణి, రోహన్‌తో కలసి జగిత్యాలలో బస్సు ఎక్కారు. ప్రమాదంలో పద్మ(37) చనిపోగా.. మణి కోమాలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. చిన్నారి రోహన్ కు గాయాలయ్యాయి. నాలుగు రోజుల క్రితం మామాడ మండలం పరిమండల్ లో బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న గురువయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
“ప్రకాశం జిల్లా కనిగిరి హనుమంతుని పాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన బాలరాజు అనే ప్రయాణికుడు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. బస్సులో చిక్కుకున్న పలువురిని బయటకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో బాలరాజుకు కూడా గాయాలయ్యాయి. మార్కాపుర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.’’
