- ఎలాంటి డ్యూటీలో పాల్గొనకుండా పర్మినెంట్‌గా డిబార్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన కాలేజీలు, వారికి సహకరిస్తున్న ఎగ్జామినర్లపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. విద్యార్థులను ఎగ్జామ్ రాయించాల్సింది పోయి.. దగ్గరుండి కాపీ కొట్టిస్తున్న ఎగ్జామినర్ల బండారం కమాండ్ కంట్రోల్ రూమ్ సాక్షిగా బయటపడింది. ఈ నెల 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో జరిగే పరీక్షలను ఇంటర్ బోర్డులో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరాల్లో పర్యవేక్షించారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పలు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు. స్పందించిన అధికారులు 14 మంది ఎగ్జామినర్లను విధుల నుంచి తొలగించారు.
సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ..
ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నా.. వాటిని ఆఫ్ చేసి, బ్లింక్ అయ్యేలా ట్యాంపరింగ్ చేసి మాస్ కాపీయింగ్‌కు తెరలేపారు. కొందరు ఎగ్జామినర్లు విద్యార్థులకు ఆన్సర్ స్లిప్పులు పంచగా.. మరికొందరు ఎగ్జామ్ టైమ్ అయిపోక ముందే మార్కులు వేస్తూ బుక్కయ్యారు. జూబ్లీహిల్స్ రెసోనెన్స్, మలక్‌పేట ఎంఎస్, షాహీన్, కూకట్‌పల్లిలోని 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీల్లోనే మాస్ కాపీయింగ్ ఎక్కువగా సాగింది.
ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు 'జీరో టాలరెన్స్' పాలసీని ప్రకటించింది. భవిష్యత్తులో ఇంటర్ బోర్డుకు సంబంధించిన థియరీ గానీ, ప్రాక్టికల్స్ గానీ.. ఎలాంటి డ్యూటీలోనూ పాల్గొనకుండా వీరిని పర్మినెంట్‌గా డిబార్ చేస్తున్నట్లు ప్రకటించింది.
