మెడిసిన్​ స్టూడెంట్లు 14% మందే పాస్

మెడిసిన్​ స్టూడెంట్లు 14% మందే పాస్

విదేశాల్లో మెడిసిన్​ చదివిన స్టూడెంట్లు ఎఫ్​ఎంజీఈలో ఫెయిల్​

మారిషస్​, నేపాల్​, బంగ్లాదేశ్​లో చదివినోళ్లే మెరుగు

ఎంబీబీఎస్​.. మన దగ్గర ఆ సీటు రావాలంటే నీట్​ కొట్టాల్సిందే. అది కూడా సర్కారీ కాలేజీల్లో వస్తేనే జేబుకు కొంచెం సేఫ్​. ప్రైవేటులో వచ్చినా, మేనేజ్​మెంట్​ సీటు కొనాలన్నా లక్షలు విదిలించాల్సిందే. చాలా మందికి ఆ స్థోమత ఉండదు. అందుకే తక్కువ ఖర్చుతో మెడిసిన్​ సీట్లిచ్చే దేశాల బాట పడుతున్నారు మనోళ్లు. చదువు పూర్తి చేస్తున్నారు. కానీ, ఇక్కడకు వచ్చే సరికి ఫెయిలైపోతున్నారు. అవును, విదేశాల్లో డాక్టర్​ చదివినోళ్లు ఇండియాలో ప్రాక్టీస్​ చేయాలంటే ఫారిన్​ మెడికల్​ గ్రాడ్యుయేట్స్​ ఎగ్జామినేషన్​ (ఎఫ్​ఎంజీఈ)ని కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అందులో పాసవ్వాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువంతా సాఫీగా సాగినా, ఎఫ్​ఎంఈజీ దగ్గరకు వచ్చేసరికి మనోళ్లు డీలా పడిపోతున్నారు. ఆ టెస్టును పాసవ్వలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 14.2% మంది మాత్రమే ఆ టెస్టులో పాసయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎఫ్​ఎంజీఈని నిర్వహించే నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ వెల్లడించిన వివరాలివి.

8,764 మందే…

2015 నుంచి 2018 మధ్య వివిధ దేశాల్లో 61,708 మంది మెడిసిన్​ చదివారు. అందులో ఎఫ్​ఎంజీఈలో గట్టెక్కింది కేవలం 8,764 మంది. అంటే కేవలం 14.2%. చైనా, రష్యా, ఉక్రెయిన్​ల నుంచి మెడిసిన్​ పట్టా పొందినోళ్లలోనే ఎక్కువ మంది పరీక్షను పాసవ్వలేకపోతున్నారు. మొత్తం స్టూడెంట్లలో 54,055 (87.6%) మంది చైనా, రష్యా, బంగ్లాదేశ్​, ఉక్రెయిన్​, నేపాల్​, కిర్గిస్థాన్​, కజకిస్థాన్​లలోనే చదువుతున్నారు. మారిషస్​లో చదివిన 154 మంది స్టూడెంట్లలో 81 మంది (52%) టెస్టు పాసయ్యారు. 1,265 మంది స్టూడెంట్లకు గానూ 343 మందితో బంగ్లాదేశ్​లో చదివిన వాళ్లు రెండో స్థానంలో నిలిచారు. నేపాల్​లో చదివిన 5,894 మంది స్టూడెంట్లలో 1,042 (17.68%) మంది ఎగ్జామ్​ పాసయ్యారు. ఎక్కువ మంది స్టూడెంట్లలో 20,314 మందితో చైనా టాప్​లో ఉంది. అయితే, ఆ మొత్తం విద్యార్థుల్లో ఎఫ్​ఎంజీఈని క్లియర్​ చేసింది కేవలం 2,370 మంది. అంటే 11.67%.

రష్యాలో చదివిన వాళ్లలో 12.89 %, ఉక్రెయిన్​లో మెడిసిన్​ పూర్తి చేసినోళ్లలో 15% మంది పాసయ్యారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే స్టూడెంట్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేలా ఈ ఫలితాలను జనానికి అందుబాటులో ఉంచామని నీతి ఆయోగ్​ సభ్యుడు డాక్టర్​ వినోద్​ పాల్​ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో 77 వేల ఎంబీబీఎస్​ సీట్లున్నాయి. అయితే, వాటిని లక్ష సీట్లకు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు వినోద్​ పాల్​ తెలిపారు. షనల్​ మెడికల్​ కమిషన్​ (ఎన్​ఎంసీ)ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఎంబీబీఎస్​ చదివినోళ్లైనా లైసెన్సు కోసం ఓ టెస్టు రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదివిన వారికి ఎఫ్​ఎంజీఈ యథావిధిగా ఉంటుంది. ఎన్​ఎంసీ అమల్లోకి రావడానికి మరో మూడేళ్లయినా పట్టే అవకాశం ఉంది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి