హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో146 మంది ఇన్‌‌స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో146 మంది ఇన్‌‌స్పెక్టర్ల బదిలీ
  • పలు పోలీస్​ స్టేషన్ల పేర్లు మార్పు 
  • సిటీ కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్​లో భాగంగానే..
  • మార్పులతో 72కు చేరిన లా అండ్ ఆర్డర్‌‌ పీఎస్​లు 
  • 28కి చేరిన ట్రాఫిక్​ పీఎస్​లు

హైదరాబాద్‌‌, వెలుగు:హైదరాబాద్​ పోలీస్‌‌ కమిషనరేట్‌‌లో భారీ మార్పులు జరిగాయి. 35 ఏండ్ల తరువాత కమిషనరేట్‌‌ను పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఇందులో భాగంగా కొత్త పోలీస్ స్టేషన్లకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు(ఎస్‌‌హెచ్‌‌ఓ)లను నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఇన్‌‌స్పెక్టర్లను బదిలీ చేసి పోస్టింగ్స్‌‌ ఇచ్చారు. 

ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్‌‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జోన్లు, కొత్త పోలీస్‌‌ స్టేషన్లు, పోలీస్‌‌స్టేషన్‌‌ అప్‌‌గ్రేడ్‌‌కు సంబంధించి 2023 మార్చి 30న హోంశాఖ జారీ చేసిన రీఆర్గనైజేషన్ జీఓ  ప్రకారం పునర్ వ్యవస్థీకరణ చేసినట్లు వెల్లడించారు.

రెండు లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌ కొత్త జోన్లు, 11 డివిజన్లు

కమిషనరేట్ రీ ఆర్గనైజేషన్‌‌లో భాగంగా సౌత్‌‌ ఈస్ట్, సౌత్ వెస్ట్ లా అండ్ ఆర్డర్ జోన్‌‌,11 లా అండ్ ఆర్డర్ డివిజన్లు,11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి నుంచి 72 లా అండ్‌‌ ఆర్డర్ పోలీస్​స్టేషన్లు పని చేయనున్నాయి. అలాగే, అదనపు ట్రాఫిక్ జోన్ (ట్రాఫిక్ 3) సహా మరో 13 కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పాతవి 15తో కలిపి మొత్తం 28 ట్రాఫిక్‌‌ పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 

7 జోన్లకు 7 మహిళా పోలీస్ స్టేషన్లతో మహిళా భద్రతా విభాగం, ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్, ఐటీ వింగ్, నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం1200 మంది సిబ్బందిని అదనంగా కేటాయించారు. హైదరాబాద్‌‌ సిటీ కమిషనరేట్‌‌కు మంజూరైన 17,020 మంది సిబ్బందిని అంతర్గత సర్దుబాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 

టోలిచౌకిలో కొత్తగా లా అండ్ ఆర్డర్ పీఎస్‌‌

72వ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌‌గా కొత్తగా టోలిచౌకిని ఏర్పాటు చేశారు. ఇక నుంచి గోల్కొండ డివిజన్‌‌ను టోలిచౌకి డివిజన్‌‌గాను, సెక్రటేరియట్ పీఎస్‌‌ను లేక్ పీఎస్‌‌గా, హుమాయున్ నగర్ పీఎస్‌‌ను మెహదీపట్నం పీఎస్‌‌గా, షాహినాయత్‌‌ గంజ్ పోలీస్‌‌ స్టేషన్‌‌లను గోషామహల్ పీఎస్‌‌గా పిలవనున్నారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పునర్​వ్యవస్థీకరణలో భాగంగా- 28 లా అండ్ ఆర్డర్ డివిజన్ల ప్రకారం మారేడ్‌‌పల్లి, బోయిన్‌‌పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను తీసేశారు. ప్రస్తుతం ఉన్న లా ఆండ్ ఆర్డర్  పోలీస్​స్టేషన్ల పరిధి ప్రకారం ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పీఎస్‌‌ల పేర్లు మార్చారు.