నేటి నుంచి హెల్త్​ స్టాఫ్​ సమ్మె.. సమ్మె విరమించకపోతే తొలగిస్తామని ఆఫీసర్ల బెదిరింపు

నేటి నుంచి హెల్త్​ స్టాఫ్​ సమ్మె.. సమ్మె విరమించకపోతే తొలగిస్తామని ఆఫీసర్ల బెదిరింపు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్​ స్టాఫ్​ ఈనెల 31(గురువారం) నుంచి సమ్మె బాట పట్టనున్నారు. నేషనల్​ హెల్త్​ మిషన్​(ఎన్​హెచ్​ఎం)లో  కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో పనిచేస్తున్న పలు విభాగాలకు చెందిన దాదాపు 16వేల మంది హెల్త్​ స్టాఫ్​ నిరవధిక సమ్మె లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎన్​హెచ్​ఎంలో పనిచేస్తున్న సెకండ్​ ఏఎన్​ఎంలు రెండు వారాలుగా సమ్మె చేస్తున్నారు.  అయితే సమ్మె శిబిరాల వద్దకు డీఎంహెచ్​వోలతో పాటు ఇతర ఆఫీసర్లు వెళ్లి సమ్మె విరమించకపోతే డిస్మిస్​ చేస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్​లో వెయిటేజ్​ మార్కులను ఇవ్వబోమని చెప్తున్నారు.  ఇప్పటికే షోకాజ్​నోటీస్​లు జారీచేశామని బెదిరిస్తుండడంతో సెకండ్​ ఏఎన్​ఎంలు ప్రభుత్వ తీరుపై మండి పడ్తున్నారు.  వీరి బాటలోనే ఎన్​హెచ్​ఎం స్కీంలో పనిచేస్తున్న స్టాఫ్​ నర్స్​లు, ల్యాబ్​ టెక్నీషియన్స్​, ఫార్మసిస్టులు, డేటా ఆపరేటర్లు, కాంటిన్​జెన్స్​ వర్కర్స్​ వెళ్తుండడంతో వైద్య సేవలపై ఎఫెక్ట్​ పడనుంది.

మేమంటే నిర్లక్ష్యమా?

16 ఏండ్లుగా వైద్య సేవలందిస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఎన్​ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్​హెచ్​ఎం స్కీంలో పనిచేస్తున్న డాక్టర్లను రెగ్యులరైజ్​ చేసి తమను పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్​ టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్య సేవలందించినందుకు తమ సేవలను మెచ్చుకుందని, రెగ్యులర్​ చేయడంలో వివక్ష చూపుతోందని వాపోతున్నారు. మెటర్నటీ లీవ్​లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో ప్రకటనలకే పరిమితమైందని వాపోయారు. 

బెదిరింపులు దారుణం

మారుమూల గ్రామాల్లో,  కొండ కోనల్లో తిరుగుతూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నాం.   సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు దిగడం దారుణం. నోటిఫికేషన్​ రద్దు చేసి మమ్మల్ని రెగ్యులర్​ చేయాలి. 

బానోత్​ ప్రియాంక, సెకండ్​ ఏఎన్​ఎం, భద్రాద్రి కొత్తగూడెం 

షోకాజ్​ నోటిసులిచ్చాం..

సమ్మెను విరమించాలని సెకండ్​ ఏఎన్​ఎంలకు షోకాజ్​ నోటీసులు ఇచ్చాం. సమ్మె విరమించకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలను వారికి వివరించాం. సమ్మె విరమించకపోతే ఉద్యోగ నోటిఫికేషన్​లో వెయిటేజ్​ మార్కులు ఇవ్వబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా సెకండ్​ ఏఎన్​ఎంలు సమ్మెను విరమించి డ్యూటీలోకి రావాలి. 

 శిరీష,   డీఎంహెచ్​వో , భద్రాద్రి కొత్తగూడెం