బంగారు తెలంగాణ కాదు.. నిరుద్యోగ తెలంగాణ: గడ్డం వంశీకృష్ణ

 బంగారు తెలంగాణ కాదు.. నిరుద్యోగ తెలంగాణ: గడ్డం వంశీకృష్ణ

జగిత్యాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని.. నిరుద్యోగ తెలంగాణ చేశాడని ఆయన మండిపడ్డారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ధర్మపురి నియోజకవర్గంలోని బుగ్గారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.. కానీ, తను మాత్రం వందల ఎకరాల ఫాం హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు.. కానీ, కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పారు. తన బిడ్డ కవిత ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చారని మండిపడ్డారు. 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ బుగ్గారం మండలానికి బస్ స్టాప్ తీసుకురాలేదని దుయ్యబట్టారు.

బుగ్గారం ముత్యాల పోచమ్మ సాక్షిగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వంశీ హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతుల ద్రోహి అని ఫైరయ్యారు. ఇక్కడి గోదావరి నీటిని.. సిద్దిపేట, గజ్వేల్ తరలించారని.. ఈ ప్రాంతంలో పంటలు ఎండుతుంటే గత ప్రభుత్వానికి కనబడలేదా? అని ప్రశ్నించారు. రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని..  రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. మీ ఇంట్లో చిన్నకొడుకులా భావించి తనను ఆశీర్వదించి గెలిపించాలని వంశీకృష్ణ కోరారు.