- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణ అభివృద్ధిలో కులమతాలకు అతీతంగా సేవలు అందిస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో ఆదివారం శివాజీ భవన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో రాజన్న భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఆరే క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ భవన్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు.
సుమారు 54 కులాలను గుర్తించి ప్రతి కుల సంఘ భవనానికి రూ.5 లక్షల వరకు వెచ్చించి కులాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. ఆరే క్షత్రియ కులస్తులు కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా శివాజీ భవన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుల్కం రాజు, వైస్ చైర్‌పర్సన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేశ్, కౌన్సిలర్లు గూడెస్ సంతోష, కొక్కుల బాలకృష్ణ పాల్గొన్నారు.
