హనుమాన్ మాలలో ఉన్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించక పోవడం జగిత్యాల జిల్లాలో వివాదాస్పదంగా మారింది. సోమవారం (మార్చి 16) ఉదయం మెట్‌పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, హనుమాన్ స్వాములు ధర్నా భారీ ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించలేదు స్కూల్ యాజమాన్యం. పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి విద్యార్థులను అడ్డుకున్నారు. 21 రోజులు పాఠశాలకు అనుమతించమని, విద్యార్థుల నుంచి లాంగ్ లీవ్ లెటర్ రాయించుకున్నారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు హనుమాన్ స్వాములతో కలిసి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
హనుమాన్ మాలలో ఉన్న స్వాములు స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్కూళ్లోకి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా కులాలకు, మతాలకు అతీతంగా పాఠశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంతో మంది విద్యా్ర్థులను అన్ని మతాలను, సంస్కృతులను గౌరవించేలా తీర్చిదిద్దామని అన్నారు. ముస్లింలు బురఖాలు, క్రిష్టియన్ల ప్రత్యేక డ్రెస్సులు, హిందువులు మాలలను వేసుకుని రావడాన్ని నిషేధించినట్లు చెప్పారు. విద్యా వాతావరణానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు, విద్యార్థుల దృష్టి చదువులపైన ఉండేలా చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. కానీ తల్లిదండ్రులు, మాల ధారులు వచ్చి ఫర్నీచర్ ధ్వంసం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.
