తెలంగాణ అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికెళ్తా : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికెళ్తా :  సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వందేడ్లు సరిపడ విధ్వంసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయమనే బాధ కేసీఆర్ లో ఉందన్నారు. వీ6తో స్పెషల్ షోలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.  ప్రతిపక్షనేత పాత్రను కేసీఆర్ మనస్ఫూర్తిగా తీసుకోవడం లేదని చెప్పారు.  తెలంగాణను కేసీఆర్ తెస్తే అమరుల త్యాగం ఏమైనట్టు అని రేవంత్ ప్రశ్నించారు.  కోదండరామ్ JAC  చైర్మన్  తర్వాతే తెలంగాణ ఉద్యమం లేచిందన్నారు. సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని..  జయశంకర్ సారే మన తెలంగాణకు జాతిపిత అని చెప్పుకొచ్చారు.  

పార్లమెంట్ ఎన్నికల్లో  తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, మోదీనే అని అన్నారు సీఎం రేవంత్.  కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికి వెళ్లి కలుస్తానన్నారు రేవంత్.  పదేళ్లు తెలంగాణ సీఎంగా తానే ఉంటానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.  పదేండ్ల తరువాత పార్టీ ఏ బాధ్యతిస్తే  అది చేస్తానని చెప్పారు.  ఆదర్శంగా ఉండే రాజకీయం చేయాలన్నదే తన అలోచన అని చెప్పుకొచ్చారు. 

 వంద రోజుల్లోనే ఏ ప్రభుత్వం కూడా అన్ని పనులు చేయలేదన్నారు సీఎం రేవంత్.  తమకు ఐదేళ్ల టైమ్ ఉందని..  ఆలోపు అన్ని చేస్తామని చెప్పారు.  పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఐదు నెలల పాలన చూసి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.  తమ వందరోజుల పాలనకు ఇదే రెఫరెండం అని చెప్పారు.  పవర్ కట్ పై కేసీఆర్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు సీఎం రేవంత్.  కేసీఆర్ అబద్ధాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.  కేసీఆర్ లో ఇప్పటికైనా మార్పు రావాలని సూచించారు.  కేసీఆర్ అనుభవం రాష్ట్రానికి ఉపయోగిస్తే స్వాగతిస్తామన్నారు.