నల్గొండలో రూ.11 కోట్ల 7 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్

నల్గొండలో రూ.11 కోట్ల 7 లక్షల విలువైన నగదు, మద్యం సీజ్

 పార్లమెంట్ ఎన్నికల వేళ నల్గొండలో ఇప్పటివరకు భారీగా నగదు, మద్యం పట్టుపడినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిత్యం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ నిర్వహించామని ఆమె చెప్పారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం సీజ్ చేశామన్నారు. 

ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో  ఇప్పటివరకు 11 కోట్ల 7 లక్షల 41 వేల రూపాయల విలువ గల నగదు, మద్యం, గంజాయి, ఇతర వస్తువుల స్వాదీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  అంతరాష్ట్ర సరిహద్దుల్లో నిఘా, సరిహద్దు ప్రాంతాలు వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్ పాండ్, నాగార్జున సాగర్ అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.  ఆంధ్ర రాష్ట్ర అధికారులతోనూ సమన్వయంతో పని చేస్తూన్నామన్నారు.

అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లకు అనుబంధంగా జాతీయ రహదారి 65 పై కేతపల్లి టోల్ ప్లాజా, చిట్యాల పోలీసు స్టేషన్ వట్టిమర్తి, మాల్, డిండి పోలీసు స్టేషన్ పరిదిలో ఇలా పలు ప్రాంతాల్లో అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని చెప్పారామె. పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో జిల్లా అంతటా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.