- పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు కేటాయింపు
- ఐదేండ్లలో దేశవ్యాప్తంగా రూ.4,35,236 కోట్ల గ్రాంట్లు
- ఏపీకి రూ.16,627 కోట్లు కేటాయింపు
- కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మార్గదర్శకాలు విడుదల
- సొంత ఆదాయం పెంచుకుంటేనే అదనపు నిధులు
- జీతాలకు ఈ నిధులు వాడొద్దని కేంద్రం సూచన
హైదరాబాద్, వెలుగు: దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్‌ఎల్‌బీ) రూపురేఖలు మార్చేందుకు 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు కేటాయించింది. 2026 –-27 నుంచి 2030 -–31 వరకు ఐదేండ్ల కాలానికి మొత్తం రూ.4,35,236 కోట్ల గ్రాంట్‌ను సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఎలా ఖర్చు చేయాలి, నిధులు పొందాలంటే ఏయే నిబంధనలు పాటించాలనే అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
కాగా, తెలంగాణకు ఐదేండ్ల కాలపరిమితితో మొత్తం రూ.9,968 కోట్లు కేటాయించింది. ఇందులో బేసిక్ గ్రాంట్స్ కింద రూ.7,974 కోట్లు, పెర్ఫార్మెన్స్ విభాగంలో రూ.1,994 కోట్లు సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్లలో మొత్తం రూ.16,627 కోట్లు అలాట్ చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్స్ రూ.13,302 కోట్లు, పెర్ఫార్మెన్స్ కింద రూ.3,325 కోట్లు ఇచ్చింది. తెలంగాణ కంటే ఏపీకి అదనంగా రూ.6,659 కోట్లు కేటాయించడం విశేషం.
అయితే, ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతం ‘బేసిక్ గ్రాంట్స్’ కింద, మిగిలిన 20 శాతం ‘పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్’ కింద కేటాయించారు. బేసిక్ గ్రాంట్స్ 50 శాతం నిధులను టైడ్ కింద కేటాయించారు. ఇందులో తాగు నీరు, పారిశుధ్యం, ఓడీఎఫ్ ప్లస్ నిర్వహణకు మాత్రమే వినియోగించాలి. మిగిలిన 50 శాతం (అన్‌టైడ్) నిధులను స్థానిక అవసరాల కోసం వినియోగించుకోవచ్చు అని పేర్కొంది. పెర్ఫార్మెన్స్ గ్రాంట్స్‌లో భాగంగా పన్నుల వసూళ్లు పెంచుకున్న పంచాయతీలకు, ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకు వీటిని ప్రోత్సాహకాలుగా ఇవ్వనున్నారు.
సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తేనే నిధులు..
నిధులు సక్రమంగా విడుదల కావాలంటే పంచాయతీలు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలు కొలువు దీరాలని పేర్కొంది. రెండేండ్ల ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ప్రొవిజనల్ అకౌంట్స్ అందుబాటులో ఉండాలి. పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని పెంచుకోవాలి. గ్రామ పంచాయతీల్లో ఏడాదికి సగటున ఒక్కో ఇంటి నుంచి కనీసం రూ.1,200 పన్ను వసూలు చేసే దిశగా అడుగులు వేయాలి. నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ -గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
దేనికి వాడాలి? దేనికి వాడకూడదు?
అన్‌టైడ్ నిధులలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం 20 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ఈ గ్రాంట్ల నుంచి పంచాయతీ సిబ్బందికి జీతాలు, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు చెల్లించకూడదు. ఆడిటింగ్, అకౌంటింగ్ కోసం తీసుకునే ప్రొఫెషనల్స్ ఫీజులు చెల్లించవచ్చు. కేంద్రం నుంచి విడుదలైన నిధులను 10 పని దినాల్లోపు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఖాతాలకు బదిలీ చేయాలి. ఆలస్యమైతే రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించిన వడ్డీతో కలిపి పంచాయతీలకు చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఆర్థిక జవాబుదారీతనం పెంచడం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు కేంద్రం పేర్కొంది.
