V6 News

లోయలో పడిన జీపు..17 మంది మృతి... నేపాల్‌‌‌‌ లోని రోల్పా జిల్లాలో ఘటన

లోయలో పడిన జీపు..17 మంది మృతి... నేపాల్‌‌‌‌ లోని రోల్పా జిల్లాలో ఘటన

ఖాట్మండు: నేపాల్‌‌‌‌లోని రోల్పా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సుమారు 700 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించారు. పోలీసుల ప్రకారం.. థావాంగ్ రూరల్ మునిసిపాలిటీ పరిధిలోని జల్జాలా ప్రాంతంలో శుక్రవారం జరగనున్న వైశాఖ పూర్ణిమ ఉత్సవాలకు హాజరయ్యేందుకు రోల్పా జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఒక ప్రైవేట్ జీపును అద్దెకు తీసుకున్నారు. 

అయితే, అప్పటికే కురుస్తున్న వర్షం కారణంగా కొండ మార్గంలోని రోడ్డు బురదమయంగా మారింది. ప్రయాణ సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన లోయలోకి జారిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

అయితే, ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో జీపులో కచ్చితంగా ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. పండుగకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం ఆయా గ్రామాల్లో తీరని శోకాన్ని నింపింది.