పెండ్లికి ఒప్పుకోలేదని రాయితో కొట్టి చంపిండు

పెండ్లికి ఒప్పుకోలేదని రాయితో కొట్టి చంపిండు

సికింద్రాబాద్, వెలుగు:

చిన్నప్పుడు కలిసి చదువుకున్నాడు..పెద్దయ్యాక అమ్మాయిపై ఇష్టం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అమ్మాయి మైనర్​ కావడంతో ఆమె పేరెంట్స్​ ఒప్పుకోలేదు. దీంతో కక్ష పెంచుకున్న అతడు,  మాట్లాడుకుందాం.. రమ్మని చెప్పి గొడవపడ్డాడు. బండ రాయితో మోదాడు. గొంతు కోసి రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందికి పడేశాడు. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్​స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో ఈ ఘటన జరిగింది. వివరాలను నార్త్​జోన్ డీసీపీ కమలేశ్వర్ శుక్రవారం వెల్లడించారు. నిందితుడు షోయబ్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

చదివించాలని అనుకున్నరు..

తమ్ముడు, అమ్మతో కలిసి హైదరాబాద్​లోని వారాసిగూడలో బాలిక (17) ఉంటోంది. 2018లో ఆమె తండ్రి చనిపోయాడు. స్థానికంగా ఓ కాలేజీలో జూనియర్ ఇంటర్​చదువుతోంది. అదే ప్రాంతంలో ఉంటున్న షోయబ్​(21) ఫ్లెక్సీ బోర్డు డిజైనర్​గా పని చేస్తున్నాడు. 1 నుంచి 9వ తరగతి వరకు వారిద్దరూ ఒకే స్కూల్​లో చదువుకున్నారు. ఈ క్రమంలో బాలికను షోయబ్ పెళ్లి చేసుకోవాలని భావించాడు. సంబంధం మాట్లాడేందుకు తన తల్లిదండ్రులను బాలిక ఇంటికి పంపించాడు. తమ కూతురు మైనర్ అని, అప్పుడే పెళ్లి చేయలేమని, ఇంకా చదివిస్తామని బాలిక తల్లి చెప్పి పంపింది. దీంతో కోపం పెంచుకున్న షోయబ్​ బాలికను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి మాట్లాడుకుందామని రమ్మన్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రెండంతస్తుల బిల్డింగ్ టెర్రస్​పైకి తీసుకువెళ్లాడు. అక్కడ కొద్దిసేపు గొడవ పడ్డ షోయబ్.. టెర్రస్​గోడకు అదిమిపట్టి గొంతు నులిమాడు. బండరాయితో గొంతుపై విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కూడా కొట్టి ఆ బండతోనే గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఈడ్చుకెళ్లి బిల్డింగ్​పై నుంచి కిందకు తోసేసి పారిపోయాడు.